హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అడగులు పడుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం రూ.205కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణానికి డిజైన్లతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది.
ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా అదనంగా అవసరమైన 253 ఎకరాల సేకరణకు సైతం నిధులు విడుదలయ్యాయి. 253 ఎకరాల భూమిలో కొంత రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇన్‌స్ట్రూమెంట్ ఇన్‌స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవతోనే మామునూర్ ఎయిర్‌పోర్ట్‌కు ముందడుగు పడింది.
ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.26 కోట్లు..
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ డివిజినల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.26కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు రోడ్లు మరియు భవనాల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ డివిజినల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం ద్వారా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు ఒకేచోట అందనున్నాయి.