కంటోన్మెంట్ బోర్డు సూచనలతో అభివృద్ధి పనులకు మళ్లించేందుకు జీవో విడుదల
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పారడైజ్ నుంచి షామీర్ పేట ఓర్‌ఆర్‌ఆర్(రాజీవ్ రహదారిపై) వరకు, పారడైజ్ నుంచి డైరీ ఫామ్(జాతీయ రహదారి 44) లో హెచ్‌ఎండీఏ నిర్మించే వెలివేటెడ్ కారిడార్‌ల కోసం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.303.62 కోట్లు విడుదల చేసింది.
ఈ మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్ జీవో 568ను గురువారం విడుదల చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఈ కారిడార్‌లను నిర్మించనుంది. ఈ స్థలాలు కంటోన్మెంట్‌కు చెందినవి కావడంతో ఇక్కడ చేపట్టిన భూసేకరణకు ఢిల్లీ కేంద్రంగా ఉండే కంటోన్మెంట్ ప్రధాన కార్యాలయం నిధులు చెల్లించాల్సి ఉంది.
కానీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం లో నిర్వహించే పలు అభి వృద్ధి కార్యక్రమాలకు నిధులు అవసరం ఉండటంతో భూసేకరణ నిధులను నేరుగా తమ ఖాతాలోకి జమ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కోరింది. ఈ మేరకు గతంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఈ నిధులను స్థానిక బోర్డుకు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఖాతాలో జమ చేసేందుకు అంగీకరించింది. ఇదిలా ఉండగా, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు పనులకు ఈ నిధులను కేటాయించేలా బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో భూసేకరణకు చెల్లిం చాల్సిన రూ.303.62 కోట్లను జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డుకు కేటాయిస్తూ ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్ జీవో జారీ చేశారు. ఈ నిధులతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అండర్ గ్రౌండ్ సివరేజ్ విధానాన్ని అప్‌గ్రేడ్ చేయడంతో పాటు నాలాలను మరింత పటిష్ఠం చేయనున్నారు.