- రూ.2,350 కోట్ల ప్రయాణ ఖర్చు ఆదా
- ఆర్టీసీపై సమీక్షలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూలై 20(విజయక్రాంతి): మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు 68.60 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఫలితంగా రూ.2,350 కోట్ల ప్రయాణ ఖర్చును ఆదా చేసుకున్నారని తెలిపారు. నిత్యం 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు.
మహిళలకు ఉచిత ప్రయాణాల ఫలితంగా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని అందుకు అనుగుణంగా త్వరలో కొత్త బస్సులను తీసుకురావడమే కాకుండా, ఉద్యోగ నియామకాలు కూడా చేపడుతున్నామని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శనివారం టీజీఎస్‌ఆర్టీసీ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడున్న సర్వీసుల కంటే అదనంగా కొత్త బస్సులను ప్రవేశపెడతామన్నారు. ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని, జాబ్ కేలండర్ ప్రకారం వీలైనంత త్వరగా భర్తీ చేస్తామన్నారు. కాగా త్వరలోనే ఆర్టీసీ సంస్థ రూ.8,500 కోట్ల టర్నోవర్ కార్పొరేషన్‌గా అవతరించబోతుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సమావేశంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఆర్‌ఈఎంఎఫ్‌ఎస్ సభ్యత్వం విస్తరింపు
రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీం కింద లభించే ప్రయోజనాలను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ వర్తింపజేసింది. గతంలో ఉన్న నిబంధనల్లో మార్పు చేస్తూ కొత్త సర్క్యులర్‌ను సంస్థ జారీ చేసింది. మార్పులు చేసిన సర్క్యులర్‌ను సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. మెడికల్ రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొందని జీవిత భాగస్వాములూ ఈ స్కీం సభ్యత్వాన్ని పొంది ప్రయోజనాలను అం దుకుంటారు. సీలింగ్ ప్రకారం సభ్యత్వం పొందిన లభ్ధిదారులు జీవిత కాలం వరకు వైద్య ఖర్చులకు రూ.4 లక్షల వరకు వినియోగించుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించింది.
ఆర్టీసీ దవాఖానలో అత్యాధునిక సేవలు
మంత్రి పొన్నం ప్రభాకర్
తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ఇక్కడి వైద్య సేవలను సద్వినియోగం చేసుకునాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆర్టీసీ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని శనివారం ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ దవాఖానలో అందుతున్న వైద్యసేవలపై మంత్రి ఆరా తీశారు. చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన ముచ్చటించారు. భవిష్యత్తులో ఆర్టీసీ దవాఖా నలో మరిన్ని అత్యాధునిక వైద్య సేవ లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జ నార్, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.