calender_icon.png 23 October, 2024 | 6:05 AM

చిట్టీల పేరుతో 2.6కోట్లకు టోకరా

23-10-2024 01:41:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): చిట్టీల పేరుతో కస్టమర్ల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసి కుటుంబంతో సహా పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మలినేని సీతారామయ్య కుటుంబ సభ్యులతో కలిసి కుత్బుల్లాపూర్ ప్రాంతంలో 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు.

ఈ క్రమంలో తన అల్లుడు మురళీకృష్ణతో కలిసి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ‘సోమశేఖర ఫిన్ కార్ప్ చిట్ ఫండ్స్’ పేరుతో రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు తెలిసినవారు, స్థానికులతో చిట్టీలు కట్టించారు. అయితే గత జూలైలో చిట్ ఫండ్ మూసివేస్తున్నానని.. అందరి డబ్బు చెల్లిస్తానని కస్టమర్లకు వాగ్దానం చేశాడు.

అయితే ఎవరికీ చెప్పాపెట్టకుండా కుటుంబం మొత్తం కలిసి ఇటీవల చిట్టీల డబ్బుల ద్వారా పోగైన రూ.2 కోట్ల 65లక్షలతో పరారయ్యారు. దీంతో గాజులరామరంకు చెందిన బాధితుడు రాజేష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ(ఆర్థిక నేర విభాగం) పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు మలినేని సీతారామయ్యను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మంగళవారం అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ తెలిపారు.