calender_icon.png 18 October, 2024 | 4:56 PM

ఫీజు బకాయిలు 550 కోట్లు చెల్లించండి

18-10-2024 01:27:41 AM

ప్రభుత్వానికి ప్రైవేట్ ఫార్మసీ కాలేజీల సంఘం విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఫార్మసీ కాలేజీలకు 2021-24 వరకు దాదాపు రూ.525 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని తెలంగాణ ఫార్మసీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ జైపాల్‌రెడ్డి, గౌరవ చైర్మన్ డాక్టర్ కే రామ్‌దాస్ పేర్కొన్నారు. మూడేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని తెలిపారు.

గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఫతేమైదాన్ క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. దాదాపు ఐదు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. గతంలో జేఎన్టీయూలో జరిగిన ఓ సమావేశంలో నెలలోపు బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నిధులు లేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.