calender_icon.png 16 November, 2024 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వడ్డీ ఆశచూపి ౩00 కోట్లు హాంఫట్

16-11-2024 12:29:40 AM

  1. గోల్డ్ స్కీం పేరుతో 3,600 మందికి కుచ్చుటోపీ 
  2. 12 వెల్త్ క్యాపిటల్ కంపెనీ భారీ మోసం
  3. బాధితుల ఫిర్యాదుతో ఎనిమిదిమంది కంపెనీ నిర్వాహకుల అరెస్ట్

శేరిలింగంపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): తక్కువ పెట్టుబడికి అధిక రాబడి వస్తుందని ఆశించిన బాధితులు భారీగా పెట్టుబడులు పెట్టారు. చివరకు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. డబుల్ గోల్డ్, బైబ్యాక్ పాలసీ స్కీమ్ పేరుతో సుమారు 3,600 మంది అమాయకుల నుంచి దాదాపు రూ.300 కోట్ల మేర వసూలు చేసిన సంస్థ, బాధితులకు డబ్బులు చెల్లించకుండా మోసానికి పాల్పడింది.

ఈ క్రమంలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన నాయని హరికాంత్ ఫిర్యాదు చేయడంతో  సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసు లు.. శుక్రవారం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ కే ప్రసాద్ తెలిపిన ప్రకారం.. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో కలిదిండి పవన్ కుమార్(ఎండీ), రావుల సత్యనారాయణ, బొద్దులు హరికృష్ణ, వల్లూరు భాస్కర్‌రెడ్డి, పగడాల రవి కుమార్‌రెడ్డి, కొల్లాటి జ్యోతి, కురళ్ల మౌనిక, కుర్కుల లావణ్య ఓ జట్టుగా ఏర్పడి ‘12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్’ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు.

బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీమ్‌ని 25 నెలలకు (రూ. 8లక్షల 8 వేలు) ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతీ వినియోగదారుడు కనీసం 2 గంటల భూమిని కొనాలి. దీని కోసం వినియోగదారులు రిజిస్ట్రేషన్ చార్జీలు కలిపి రూ.8.08లక్షలు చెల్లించాలి. అనంతరం కంపెనీ కస్టమర్‌కు ప్రతినెలా 4 శాతం లాభం అందిస్తుంది.

ఇలా మొత్తం 25 నెలలకు ప్రతి నెల రూ.32,000 తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బిజినెస్ అసోసియేట్‌కి ఒక శాతం కమీషన్ ఇస్తామని చెప్పారు. అలాగే డబుల్ గోల్డ్ స్కీమ్ కింద కస్టమర్ రూ.4 లక్షల వరకు కనీస పెట్టుబడి పెడితే కంపెనీ కస్టమర్‌కు బాండ్ రసీదు ఇస్తుంది. 12 నెలల వ్యవధి పూర్తున తర్వాత, చివరిలో వారికి రూ.8లక్షల విలువైన స్విట్జర్లాండ్ ముద్రతో ఉన్న బంగారం బిస్కెట్లను అందిస్తుంది.

ఈ గోల్డ్ చిట్స్ స్కీమ్ 20 నెలల ప్లాన్ కింద, కస్టమర్లు రూ.5లక్షలు కడితే.. 19 నెలలకు 3 శాతం చొప్పున వడ్డీగా నెలకు రూ.15 వేల చొప్పున తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టిన కస్టమర్ స్కీమ్ పూర్తయిన తర్వాత మొత్తం రూ. 8 లక్షలు అందుకుంటారు.

ఈ విధంగా  సుమారు 3,600 మంది నుంచి రూ.300 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పెట్టుబడుల పేరుతో ఆర్థిక నేరానికి పాల్పడిన 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ కె ప్రసాద్ తెలిపారు.