calender_icon.png 18 January, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశాఖ ఉక్కుకు 11,440 కోట్లు

18-01-2025 02:17:06 AM

  1. ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
  2. త్వరలోనే రెండు బ్లాస్ట్ ఫార్నెస్‌లు షురూ

న్యూఢిల్లీ, జనవరి 17: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది.  ఇందుకోసం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుంది. త్వరలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్‌లు అందుబాటులోకి వస్తాయి.

ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి ప్రధాని మోదీ, ఆర్థిమంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలతో సమావేశమై కర్మాగార పునరుజ్జీవానికి చర్చలు జరిపారు. విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనిపై విభిన్న కోణాల్లో చర్చించిన అనంతరం కేంద్ర కేబినెట్ కమిటీ  ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నష్టాల నుంచి గట్టెక్కించేందుకు..

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2023-24లో రూ.4,848.86 కోట్లు, 2022-23లో రూ.2,858.74 కోట్ల నష్టాన్ని కర్మాగారం మూటగట్టుకుంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు సంస్థకు భారంగా మారా యి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. 

విశాఖ ఉక్కుకు ప్రత్యేక స్థానం: ప్రధాని మోదీ

విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రూ.10 వేల కోట్లు అందించాలని గురువారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమను ఈక్విటీ మద్దతును అందించాలని నిర్ణయించాం. 

ఇకపై అన్నీ మంచి రోజులే: చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం హర్షనీయం. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు సీతారామన్, కుమారస్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయం. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్నీ మంచి రోజులే.