20-03-2025 02:13:48 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 లక్ష్యాలను అందుకోవాలన్న ఆశయంతో ప్రభుత్వం విద్యుత్ శాఖకు ఈ బడ్జెట్‌లో పెద్దు ఎత్తున నిధులు కేటాయించింది. 2024 రూ. 16,410కోట్లను విద్యుత్ శాఖకు కేటాయించిన సర్కారు ఈసారి రూ.21,221కోట్లను ప్రతిపాదించింది. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
అందులో భాగంగా శంకర్ పల్లిలో 250మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌తో పాటు సింగరేణి, తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సంయుక్తంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నాయి. విద్యుత్ అంబులెన్స్ సర్వీసులను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇందుకోసం భారీ నిధులు అవసరం అవుతాయని భావించిన సర్కారు అందుకు తగ్గ కేటాయింపులు జరిపింది. రైతులకు అందించే విద్యుత్ సబ్సిడీ కింద రూ.11,500కోట్లు, గృహ జ్యోతి, విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కోసం రూ.3వేల కోట్లను ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది.