ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): వేములవాడ దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనుల కోసం వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీకి రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కేటాయించిన నిధులతో వేములవాడ క్షేత్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పను లు ప్రభుత్వం చేపట్టనుంది. దీనిలో వేములవాడ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయించింది. వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లను వెడల్పు చేసేందుకు రూ.47.85 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది.
ఈ నిధులతో రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్‌లైన్ డ్రైనేజీ నిర్మాణ పనులకు పరిపాలనా పరమైన ఆమోదం తెలిపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం రూ.3.8 కోట్ల నిధులను మంజూరు చేసింది.