calender_icon.png 5 October, 2024 | 8:52 PM

ఆరు జంక్షన్లకు 826 కోట్లు

05-10-2024 12:24:43 AM

కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ

రెండు దశలలో పనులు చేపట్టేలా ప్రతిపాదనలు

పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): హైద రాబాద్ మహానగరంలో కొత్తగా ఆరు జంక్షన్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రాంరభించింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ నియంత్రించాలనే సంకల్పంతో కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్ల వ్యయంతో ఆరు జంక్షన్లను నిర్మించనుంది.

రెండు దశలలో ఈ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రూ.826 కోట్ల ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు (జీవోఆర్‌టీ-471) జారీచేశారు.

హెచ్-సిటీ పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కేబీఆర్ పార్కు మీదుగా.. మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే మార్గా లు సిగ్నల్ ఫ్రీగా మారుతాయని భావిస్తోంది. 

రెండు దశలలో నిర్మాణాలు.. 

నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్, కేబీఆర్ పార్కు సమీపంలోని ముగ్ధా జంక్షన్లలో మొదటి దశలో అండర్‌పాస్‌లను, ఫ్లుఓవర్లను నిర్మించనున్నారు. ఇందుకు గాను రూ.421 కోట్ల నిధులు ఖర్చుచేయనున్నారు. అలాగే రోడ్ నంబర్-45లో, ఫిల్మ్‌నగర్ జంక్షన్, మహారాజ అగ్రసేన్ జంక్షన్, కేబీఆర్ పార్కు సమీనంలోని క్యాన్సర్ హస్పిటల్ జంక్షన్ వద్ద రెండవ దశలో అండర్‌పాస్‌లను, ఫ్లుఓవర్లను నిర్మించనున్నారు.

ఇందుకుగాను ప్రభుత్వం రూ.405 కోట్లను వెచ్చించనుంది. అయితే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు భాగంగా రోడ్‌నంబర్  మొదటి ఫ్లుఓవర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రెండవ ఫైఓవర్‌ను నిర్మించాలని 2015లోనే అప్పటి ప్రభుత్వం రూ.586కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది.

అయితే ఆ ప్రాజెక్టు ముందు పడలేదు. ప్రస్తుతం ఆరు జంక్షన్ల వద్ద చేపట్టబోయే అండర్‌పాస్‌లు, ఫ్లుఓవర్ల నిర్మాణాలకు హెచ్-సిటీలో భాగంగా ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే నిధులను సమకూర్చనుంది. 

ట్రాఫిక్, నీరు నిల్వకుండా

ప్రభుత్వం కొత్తగా ఆరు జంక్షన్ల వద్ద చేపట్టనున్న అండర్‌పాస్‌లు, ఫ్లుఓవర్లను అత్యం త అధునాతన సాంకేతిక, ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో నిర్మించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సవ్యదిశలో వెళ్లేందుకు అండర్‌పాస్‌లు, అపసవ్య దిశలో వెళ్లేందుకు ఫ్లుఓవర్లను నిర్మించనున్నారు.

దీంతో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సిగ్నల్ రహిత వ్యవస్థ ఏర్పడుతుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వర్షాకాలంలో చుక్క నీరు నిల్వకుండా నిర్మాణాలను డిజైన్ చేస్తున్నారు అధికారులు. ఈజంక్షన్ల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మరింత మారడంతో పాటు హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.