calender_icon.png 25 September, 2024 | 7:58 AM

1600 కోట్లు! బ్యాంకు గ్యారెంటీగా..

25-09-2024 04:27:51 AM

ఈఎన్సీకి తెలియకుండానే గుత్తేదారుకు చెల్లించిన ఈఈ తిరుపతి రావు

  1. ఎస్టిమేషన్స్, డిజైనింగ్ చేసింది వ్యాప్కోస్ 
  2. ఫైనల్ డిజైన్, డ్రాయింగ్స్ చేసింది సీడీవో
  3. ఊహించని వరద వల్లే సీసీ బ్లాక్స్ దెబ్బతిన్నాయి 
  4. ఓపెన్ కోర్టులో పీసీ ఘోష్ కమిషన్‌కు వెల్లడించిన ఇంజినీర్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవ కలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. మంగళ వారం బీఆర్‌కే భవన్‌లో విచారణకు పలువురు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారికి కమిషన్ పలు ప్రశ్నలు సంధించింది. ఈఎన్సీ కార్యాలయానికి, ఉన్నతాధికారులకు ఏ మాత్రం సమాచారం లేకుండానే మేడిగడ్డ ఈఈ సీహెచ్ తిరుపతిరావు.. ఏజెన్సీ అయిన ఎల్‌అండ్‌టీ సంస్థకు రూ.1597.12 కోట్ల బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చినట్లు డీప్యూటీ సీఈ మహ్మద్ అజ్మల్ ఖాన్ కమిషన్‌కు వెల్లడించారు.

ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశం మినిట్స్ అనుసరించకుండానే వీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.  ఈ ఏడాది జనవరి 8న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ప్రాజెక్టును సందర్శించిందని కమిషన్‌కు ఆయన వివరించారు. ఒరిజనల్ డాక్యుమెంట్స్ సైతం అడిగినట్లుగా తెలిపారు. 

డిజైన్లు తయారుచేసింది వాస్కోప్

డిజైన్లు, డ్రాయింగ్‌లు ఎవరు తయారుచేశారని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించగా.. వ్యాప్కోస్ సంస్థ తయారుచేసిందని ఈఈ బండ విష్ణుప్రసాద్ కమిషన్‌కు తెలిపారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్‌ను ఎన్‌ఐటి వరంగల్ పూర్తి చేసిందన్నారు. వాటిని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) సీఈ అనుమతితో అమలుచేసినట్లు వివరించారు.

బ్యారేజీల డ్యామేజ్‌కు అను కున్నదానికంటే ఎక్కువ వరద రావడం వల్లే సీసీ బ్లాకులు దెబ్బతిన్నట్లు వివరించారు. 2022 జులైలో వచ్చిన భారీ వరదల వల్ల సీసీ బ్లాక్‌లు పాడైనట్లు వివరించారు. సెకనుకు 4.25 మీటర్ల వరద డిశ్చార్జికి అవకాశం ఉండగా.. 12 నుంచి 14 మీటర్ల వరద రావడంతో సీసీ బ్లాకులు తట్టుకోలేకపోయాయని ఈఈ కమిషన్‌కు తెలిపారు.

ఈ డ్యామేజీ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాశామని కమిషన్‌కు వివరించారు. ప్రాజెక్టు సీపేజీని గమనించి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)కు డిసెంబర్ 16, 2019లో లేఖ రాసినట్లు ఈఈ తెలిపారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ బృందం జనవరి 22, 2020లో ప్రాజెక్టును తనిఖీ చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 24, 2020లో తనను ఎలాంటి కారణం లేకుండా అక్కడి నుంచి బదిలీ చేశారని కమిషన్ దృష్టికి తీసుకుపోయారు. 

5 ఏళ్ల పాటు డ్యాం నిర్వహణ గుత్తేదారు బాధ్యతే..

ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణం పూర్తయ్యాకే తాను మే 25, 2022లో కాళేశ్వరంలో ఎస్‌ఈగా చేరినట్లు ఎం కరుణాకర్ అనే రిటైర్డ్ ఇంజనీర్ కమిషన్‌కు తెలిపారు. జూలై 2022లో వచ్చిన వరదలకు సీసీ బ్లాకులు కదిలిపోయాయని ఆయన పేర్కొన్నారు. డ్యాం నిర్వహణను ఐదేళ్లపాటు గుత్తేదారే చూసుకోవాల్సి ఉంటుందని కమిషన్‌కు తెలిపారు.

మరో రెండేళ్ల పాటు లోపాల నిర్వహణకు గడువు ఉంటుందన్నారు. కాగా ఈనెల 20 నుంచి మరో దఫా ఓపెన్ కోర్టు విచారణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రారంభించింది. పలువురు ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, ఈఏన్సీలు, మాజీ ఈఎన్సీలు,  కార్యదర్శులు, మాజీ కార్యదర్శులను కమిషన్ ప్రశ్నించింది.

వారి నుంచి అఫిడవిట్ల రూపంలో ఆధారాలు సేకరించింది. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి మరికొంత మంది ఇంజినీర్లు, అధికారులను తాజాగా ప్రశ్నిస్తున్నది. తమ పరిశీలనలో ఇప్పటికే పలు లోపాలను గుర్తించిన కమిషన్ ఆ మేరకు వాటికి పూర్తిస్థాయి ఆధారాలు సేకరిస్తోంది.