calender_icon.png 1 October, 2024 | 4:50 PM

2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు?

01-10-2024 12:35:25 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: నకిలీ పత్రాలతో పొందిన, సైబర్ క్రైమ్‌లతో సంబంధం ఉన్న 2.17 కోట్ల సిమ్‌కార్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వీటితో పాటు 2.26 లక్షల మొబైల్స్‌ను బ్లాక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో టెలికాంశాఖ సమాచా రాన్ని సమర్పించినట్లు తెలుస్తోంది.

సిమ్‌కార్డులు జారీ సమయంలో కేవైసీని సమర్థంగా అమలు చేసేందుకు కఠిన చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కంబోడియా కేంద్రంగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి కొన్నినెలల కింద మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాదాపు 5వేల మంది భారతీయులు ఆ దేశంలో చిక్కుకుపోయారని, వారి ఇష్టానికి వ్యతిరేకంగా వారితో నేరాలు చేయిస్తున్నారని తెలుస్తోంది.

ఈ విషయం వెలుగులోకి రావడంతో కేంద్రం మంత్రిత్వశాఖలతో కమిటీని వేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికాం సెక్టార్లలో ఉన్న లోపాలను ఆ కమిటీ గుర్తించింది. ఇంటర్నేషనల్ కాల్స్‌ను బ్లాక్ చేయాలని ఆపరేటర్లకు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది.