calender_icon.png 17 January, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి పథకంతో 2,750 కోట్ల ఆదా

25-08-2024 01:56:45 AM

3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి 

మరిన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

త్వరలోనే పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తం

డ్రైవర్లకు ఇక జోనల్ స్థాయిలో అవార్డులు

రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి):  మహాలక్ష్మి పథకంతో మహిళలకు  రూ. 2,750 కోట్లు ఆదా అయ్యాయని రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 259 రోజుల్లో 81 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని మంత్రి పొన్నం తెలిపారు. మహాలక్ష్మితో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటికే 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, వాటి నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని తెలిపారు. 

బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో శనివారం ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులను ఆయన అందించారు. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఉన్నతాధికారులతో కలిసి అవార్డు గ్రహీతలను ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు, మెడల్స్, బ్యాడ్జీలు, నగదు రివార్డులతో ఆయన సత్కరించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్,  శ్రామిక్‌లతో పాటు సూపర్‌వైజర్స్, డిపో మేనేజర్స్, డిప్యూటీ రీజినల్ మేనేజర్స్, రీజినల్ మేనేజర్స్ అన్ని విభాగాల వారికి పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల ప్రకారం మరిన్ని పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తోందని, త్వరలోనే పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.200 కోట్ల ఆర్పీఎస్ బాండ్ డబ్బులను సిబ్బందికి అందజేస్తామన్నారు.

ఉద్యోగుల పీఎఫ్, సీసీఎస్, తదితర పెండింగ్ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ఒక ప్రణాళిక రూపొందించిందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రమాదరహిత డ్రైవర్లను గుర్తించి.. జోనల్ స్థాయిలో అవార్డులను అందజేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు సూచించారు. డిపో స్థాయిలో ఆర్టీసీ సిబ్బంది పిల్లలకు సృజనాత్మకతను ప్రొత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిబ్బం ది పనితీరును గుర్తించి వారిని అవార్డులతో సత్కరించడం వల్ల సంస్థ అంతర్గత సామ ర్థ్యం పెరుగుతుందన్నారు. వీరిని చూసి ఇతరులు స్ఫూర్తి పొంది ఉత్తమ ఉద్యోగులుగా మారుతారని మంత్రి అన్నారు. 

డ్రైవర్ కుటుంబానికి రూ.1.15 కోట్లు అందజేత 

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మరణించిన వరంగల్ డిపోనకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబసభ్యులకు రూ.1.15 కోట్ల విలువగల ప్రమాద బీమా చెక్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్  అందజేశారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన సంపత్ కుటుంబసభ్యులకు యూనియన్ బ్యాంక్ ప్రమాద బీమా ఎంతోగానో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జేడీ అపూర్వరావు, ఈడీ కృష్ణకాంత్, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు,  యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్,  అధికారులు పాల్గొన్నారు.