పెట్టుబడులే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణం
- కంపెనీలను ఆకర్షించేలా అందులోనే ట్రేడ్ సెంటర్
- రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో మూడెకరాల గుర్తింపు
- టెండర్లను ఆహ్వానించిన టీజీఐఐసీ
- మూడేళ్లలో అందుబాటులోకి రానున్న హోటల్, ట్రెడ్ సెంటర్
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చి, పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలో పరిశ్రమల శాఖ మరో ముంద డుగు వేసింది. సర్కారు ప్రతిష్ఠాత్మంగా చేపట్టనున్న టీ స్కైర్‌కు అనుసంధానంగా అధునాతన వసతులతో ఫైవ్‌స్టా ర్ లగ్జరీ హోటల్, వాణిజ్య కేంద్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
అంతర్జాతీ య ప్రమాణాలతో కూడిన హైఎండ్ ఆఫీస్ స్పేస్ అవసరాన్ని తీర్చడానికి, రూ.582 కోట్లతో ప్రపంచంలోనే టాప్ హోటళ్లలో ఒకటిగా నిలిచేలా దీని ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. హోటల్‌లో ఏదీ లేదనకుండా ఎంఎన్‌సీలకు అనువుగా ఉండేలా ఆఫీస్ స్పేస్‌తోపాటు సేద తీరేందుకు మాల్స్, రెస్టారెంట్లు, స్విమ్మింగ్ ఫూల్స్, విలాసవంతమైన రూమ్స్..
ఇలా అన్ని హంగులతో నిర్మించి హైదరాబాద్ ఖ్యాతిని మరింత ఇనుమడింప చేయబోతోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లి మండలం రాయదుర్గం మెట్రో సమీపంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ఉన్న 3 ఎకరాల్లో దీన్ని నిర్మించబోతోంది. హోటల్, ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి అర్హులైన బిడ్డర్ల నుంచి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని టీజీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది.
జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) ప్రాతిపాదికన ప్రభుత్వం ఫైవ్‌స్టార్ లగ్జరీ హోటల్, వాణిజ్య కేంద్రాన్ని నిర్మించనున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రిజిస్టర్ హోటల్స్ 33 మాత్రమే ఉన్నాయి. అందులో ఆరు ఫైవ్‌స్టార్ డీలక్స్, ఎనిమిది ఫైవ్‌స్టార్, నాలుగు ఫోర్ స్టార్, ఐదు త్రీస్టార్ హోటల్స్ ఉన్నాయి.
వాటిలో మొత్తం కలిపి 5,600 రూములు మాత్రమే ఉన్నా యి. రిజిస్టర్ కానీ హోటల్స్ దాదాపు 2,300 వరకు ఉన్నాయి. వాటి రూమ్స్ సామర్థ్యం 21వేలు కావడం గమనార్హం. కొత్తగా నిర్మించబోతున్న ఈ హోటల్ రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో, సైబర్ టవర్స్, ఐకియా, దుర్గం చెరువు, శిల్పారామానికి సమీపంలో నిర్మించనున్నారు.
ప్రపంచంలోనే ఉత్తమ అనుభూతిని ఇచ్చేలా..
దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉం టుంది. ఈ అభివృద్ధిలో హైదరాబాద్ పాత్ర కీలకమైనది. 2021 తెలంగాణ జీఎస్‌డీపీ 11.5 లక్షల కోట్లు ఉంటే.. అందులో హైదరాబాద్‌దే గణనీయంగా ఉంటుంది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణకు హైదరాబాద్ ఆర్థికంగా వృద్ధి ఇంజిన్‌గా ఉంది.
ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఫార్చూన్ ప్రఖ్యాత కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా మారింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, అమెజాన్, యాక్సెం చర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, క్వాల్కమ్, డెల్, నోవర్టిస్, జీవీకే బయో సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్, టాటా వంటి దిగ్గ జ కంపెనీలకు హైదరాబాద్‌లో ఆఫీసులు ఉన్నాయి.
దీంతో గత 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సులు జరగడం క్రమంగా పెరుగుతున్నాయి. సీవో 11 సద స్సు, వరల్డ్ మెట్రోపాలిటన్ కాంగ్రెస్, బయో ఏషియా సమ్మిట్, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్, ఇండియాజామ్ గ్లోబల్ యూ త్ ఫెస్టివల్, వరల్డ్ జియోస్పెషియల్ ఇన్‌ఫర్మేషన్ కాంగ్రెస్ వంటి అంతర్జాతీయ ఈవెం ట్లతో హైదరాబాద్ నగరం ప్రయాణ, పర్యాటక, వ్యాపారానికి గమ్యస్థానంగా మారింది.
ఈ క్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు వరల్డ్‌లోనే బెస్ట్ అనుభూతిని కలిగించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభు త్వం ప్రపంచంలోలోనే బెస్ట్ లగ్జరీ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఇవీ విశిష్టతలు
* హైదరాబాద్‌లో 5 స్టార్ హోటల్ లేని బ్రాండ్స్‌కు ఈ లగ్జరీ హోటల్ నిర్మాణం అప్పగింత
* ప్రపంచస్థాయిలో వ్యాపారస్థులను ఆకర్షించడానికి ట్రేడ్ సెంటర్ నిర్మాణం
* పార్కింగ్ కాకుండా ఈ ప్రాజెక్టు మొత్త విస్తీర్ణం 6.66 లక్షల చదరపు అడుగులు. ఇందులో హోటల్ కోసం 3.63 లక్షల చదరవు అడుగులు. ట్రేడ్ సెంటర్ కోసం 2.42 లక్షల చదరపు అడుగులు కేటాయింపు
* బాంకెట్ హాల్స్, రిటైల్, గ్రాండ్ లాబీ కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లో 0.61 లక్షల చదరవు అడుగులు కేటాయింపు.
* ఒక్కో బాంకెట్‌హాల్ నిర్మాణం 500 మంది సామర్థ్యానికి తగ్గకుండా ఉంటుంది.
* టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ 1.86 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేసి టీజీఐఐసీకి అప్పగించాల్సి ఉంటుంది.
* 36 నెలల్లో హోటల్, ట్రేడ్ సెంటర్ నిర్మాణం పూర్తవుతుంది.
* దీని నిర్మాణం జేడీయే పద్ధతిలో జరగనున్న నేపథ్యంలో టీజీఐఐసీ కాంట్రా క్టర్ మధ్య లావాదేవీల కోసం స్పెషల్ పర్పస్ కంపెనీని ఏర్పాటు చేస్తారు.
450 రూములతో హోటల్
ఈ లగ్జరీ హోటల్ నిర్మాణం ఎత్తు 60 మీటర్లు ఉండాలని టీజీఐఐసీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం 15 అంతస్థుల్లో నిర్మించనున్నారు. ఒకటి నుంచి 4వ అంతస్తు వరకు ట్రేడ్ సెంటర్‌తోపాటు కమర్షియల్ కేంద్రాలు, ఆఫీసులకు కేటాయించనున్నారు. ఐదో ఫ్లోర్‌ను రెస్టారెంట్లు, బాంకెట్ హాళ్ల కోసం, 6వ ఫోర్‌ను సర్వీస్ కోసం వినియోగిస్తారు. 7వ ఫ్లోర్ నుంచి 14వ ఫ్లోర్ వరకు 450 రూములను లగ్జరీ హోటల్ కోసం ఉపయోగిస్తారు. పార్కింగ్ కోసం నాలుగు బేస్‌మెం ట్ ఫోర్లను నిర్మిస్తారు.
బీఆర్‌ఎస్ హయంలో ఎవరూ రాలే..
లగ్జరీ హోటల్, వాణిజ్య కేంద్రాన్ని నిర్మాణానికి ప్రతిపాదలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రెడీ అయ్యాయి. ఆయితే, ఆ సమయంలో బిడ్డింగ్ కోసం ఎవరూ ఆసక్తి చూపలేదు. పైగా దీన్ని ఎప్పుడు పూర్తి చేయాలన్న సమాయాన్ని ఆ ప్రతిపాదనల్లో పేర్కొనలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ప్రతిపాదల్లో కొన్ని సవరణలు చేసి తాజా గా టెండర్లకు పిలిచింది. ఈ నెల 11న టెండర్లు ఓపెన్ కాగా.. వచ్చే నెల 12వ తేదీకి బిడ్స్ దాఖలు చేయడానికి చివరి తేదీగా టీజీఐఐసీ పేర్కొంది.