calender_icon.png 23 October, 2024 | 3:39 AM

నకిలీ ధ్రువపత్రాలతో 5 కోట్ల రుణాలు

23-10-2024 01:06:24 AM

  1. ఖమ్మం డీసీసీబీలో వెలుగుచూసిన భారీ కుంభకోణం 
  2. బదిలీపై వెళ్లిన బ్యాంక్ మేనేజరే సూత్రదారి? 
  3. ఫేక్ డాక్యుమెంట్లతో సొంత తమ్ముడికీ లోన్!

ఖమ్మం, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఖమ్మం డీసీసీబీలో నకిలీ లోన్ల బాగోతం కలకలం రేపుతోంది. ఖమ్మం గాంధీచౌక్‌లోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఖమ్మం రూరల్ బ్రాంచిలో ఈ కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టిం చి, రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంలో గతంలో పని చేసిన బ్యాంక్ మేనేజరే సూత్రదారిగా ఉన్న ట్లు తెలుస్తున్నది. ఇప్పటికే జిల్లా బ్యాంక్‌లో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం ఇటీవల బయటపడినా బ్యాంక్ సిబ్బంది మిన్నకున్నట్లు తెలుస్తోంది.

గుట్టు చప్పుడు కాకుండా విచారణ జరుపుతన్నట్లు సమాచారం. మరో వైపు గతంలో ఇక్కడ పని చేసి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనేజర్‌ను కాపాడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తున్నది. 

మేనేజర్ బదిలీ అనంతరం వెలుగులోకి..

పాత మేనేజర్ బదిలీ అయిన తర్వాత రుణాలు పొందిన వారు రుణం చెల్లించకపోవడంతో అసలు భండారం బహిర్గతమైంది. ష్యూరిటీ ఇచ్చిన వారి సర్వే నంబర్లలో భూమి లేకపోవడంతో బ్యాంక్ అధికారులు అవాక్కయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన మేనేజర్ పర్సంటేజీలు తీసుకుని, రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు వున్నాయి.

ఇదిలా ఉంటే సొంత తమ్ముడికి కూడా ఎటువంటి షూరిటీ లేకుండానే   రూ.10 లక్షల దాకా రుణం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయమై బ్యాంక్ అధికారులను వివరణ కోరగా, ఆరోపణలపై విచారణ జరుగుతుందని, వాస్తవాలు రుజువైతే సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

భూమి లేకున్నా రుణాలు..

మాజీ బ్యాంక్ మేనేజర్ చేతివాటం ప్రదర్శించి, భూమి లేకున్నా ఉన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి తన సొంత వారి కి పెద్ద ఎత్తున రుణాలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరికైనా రుణం కావాలంటే అనేక డాక్యుమెంట్లు అడగడటంతో పాటు ఎన్నో కొర్రీలు పెట్టి రోజు ల తరబడి తిప్పించుకునే బ్యాంక్ అధికారులు ఇక్కడ మాత్రం అడిగిందే తడవుగా రుణాలు ఇచ్చేశారు.

షూరిటీ లేకున్నా లక్షలాది రూపాయల రుణాలు ఇచ్చి, అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలను అతిక్రమించి, సుమారు 20 మందికి పైగానే  నకిలీ ధ్రువీకరణ పత్రాలు పెట్టి రూ.3 కోట్లకు పైగానే రుణాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది.