- 2024-25 బడ్జెట్‌లో అంచనావేసిన ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.49,255 కోట్లు
- ఏప్రిల్-డిసెంబర్ మధ్య తీసుకున్న అప్పు రూ.39,500 కోట్లు
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వం చేసిన రుణాలకు కిస్తీలు చెల్లించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారుకు అప్పులు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి ఎఫ్‌ఆర్‌బీ ఎం లోన్లను రూ.49,255 కోట్లను తీసుకోవాలని బడ్జెట్‌లో అంచనావేసింది.
అయితే ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో అంటే మూడు త్రైమాసికాల్లో రూ. 39,500 కోట్ల రుణాలను సర్కారు తీసుకుంది. ఇది బడ్జెట్ అంచనాల్లో 80 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇం కా మూడు నెలల సమయం ఉంది.
ఈ క్రమంలో నాలుగో త్రైమాసికం ముగిసే నాటికి ఎఫ్‌ఆర్‌బీఎం లోన్లు బడ్జెట్ అంచనాలను దాటుతాయా? అన్న అనుమా నం వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం మా త్రం బడ్జెట్ అంచనాలకు లోబడి అప్పు లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
గతేడాది 95 శాతం.. ఈ సారి 80 శాతం..
గత ప్రభుత్వంతో పోలిస్తే.. రేవంత్‌రెడ్డి సర్కారు అప్పులను భారీగా తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది. 2023 డిసెంబర్ నాటికే గత ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో 95 శాతం రుణాలను తీసుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 80 శాతం మాత్రమే చేసింది. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 95శాతం అప్పుల్లో రేవంత్‌రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత చేసిన అప్పులు రూ.1400 కోట్లు వినహాయిస్తే, మిగతా అంతా బీఆర్‌ఎస్ హయాంలో చేసినవే.