calender_icon.png 25 October, 2024 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

150 కోట్ల భూమి ‘ప్రైవేట్’ స్వాధీనమా?

28-08-2024 12:41:03 AM

లీజుకు తీసుకున్న భూమి బ్యాంకులో కుదువ

లోన్ తీర్చకపోవడంతో స్వాధీనం చేసుకున్న బ్యాంక్

కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): గచ్చిబౌలిలోని రూ.150 కోట్ల విలువైన భూమిని ప్రైవేట్‌కు లీజు ఇవ్వడం.. ఆ తర్వాత దాన్ని బ్యాంక్ స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమన్న పిటిషనర్ వాదనపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది.

విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సర్వే నంబర్ 91లోని రూ.150 కోట్లకుపైగా అత్యంత విలువైన పర్యాటక శాఖకు చెందిన మూడు ఎకరాలను సప్తరిషి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 2010 జూలైలో లీజుకు ఇచ్చారు. లీజు తీసుకున్న భూమిని తనాఖా పెట్టి ఆ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో లోన్ పొందింది. వారు లోన్ చెల్లించకపోవడంతో ఆ భూమిని బ్యాంక్ స్వాధీనం చేసుకుంది.

ఈ అంశంపై దర్యాప్తు చేయాలని సీబీఐకి పలుమార్లు వినతిపత్రం సమర్పించినా ఎలాంటి స్పందన లేదు. దర్యాప్తు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపించారు.

కేంద్ర టూరిజం శాఖ కార్యదర్శి, సీబీఐ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ, రంగారెడ్డి కలెక్టర్, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీతోపాటు అనధికారిక ప్రతివాదులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, మహా హోటల్స్, సప్తరిషి హోటల్స్, ఏపీ టెక్నికల్ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్స్ ఆర్గనైజేషన్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.