calender_icon.png 15 October, 2024 | 5:51 PM

2030కల్లా 15 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి

18-08-2024 12:00:00 AM

భారత్‌కు గీతా గోపీనాథ్ సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 17:  పెరుగుతున్న జనాభా దృష్ట్యా భారత్ 2030 సంవత్సరానికల్లా 14.8 కోట్ల ఆదనపు ఉద్యోగాలు సృష్టించాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ చెప్పారు. శనివారం ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉపాధి కల్పనలో జ్క్రీ20 దేశాల్లోకెల్లా భారత్ వెనుకబడి ఉన్నదని,  2010 నుంచి భారత్ సగటున 6.6 శాతం వృద్ధి సాధించిందని, అయితే ఉపాధి కల్పన రేటు 2 శాతం లోపే ఉన్నదన్నారు. ఉద్యోగ కల్పనలో ఈ రేటు జీ20 దేశాలకంటే తక్కువని చెప్పారు. భారత్ జనాభా వృద్ధి అంచనాల్ని ప్రకారం ప్రస్తుత 2024 నుంచి 2030లోపు 6 కోట్ల నుంచి 14.8 కోట్ల వరకూ అదనపు ఉద్యోగాలను కల్పించాల్సి ఉన్నదని తెలిపారు. 

మరిన్ని సంస్కరణలు అవసరం

భారీ ఉపాధి కల్పనకు భూ సంస్కరణలు, లేబర్ కోడ్స్ అమలు వంటి పలు బేసిక్ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని గోపీనాథ్ సూచించారు. ప్రభుత్వ పెట్టుబడులు బాగున్నప్పటికీ, ప్రైవేటు పెట్టుబడులు పెరిగేలా చూడాల్సి ఉన్నదన్నారు. యువత నైపుణ్యాల్ని పెంచేరీతిలో విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు చేయాలన్నారు.  ఇతర సహ ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇండియాలో టారీఫ్‌లు ఎక్కువని  గ్లోబల్ సప్లు చైన్‌లో భారత్ కీలకంగా వ్యవహరించాలంటే దిగుమతి సుంకాల్ని తగ్గించాలని సూచించారు.

ఇండియా పన్నుల ఆదాయంలో అధికశాతం పరోక్ష పన్నుల ద్వారా లభిస్తుందని ఆదాయపు పన్నుల ద్వారా కాదని చెప్పారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను బేస్‌ను పెంచుకోవాలని, దాని ద్వారానే అధిక ఆదాయం లభిస్తుందంటూ తాము వర్థమానదేశాలకు సూచిస్తూ ఉంటామన్నారు. మూలధన లాభాలపై పన్నును అధికంగా రాబట్టాల్సి ఉన్నదన్నారు. అలాగే ఆస్తి పన్ను అమలుకు ఇప్పుడు మెరుగైన టెక్నాలజీ ఉన్నదని, ఈ విభాగంలోనూ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. జీఎస్టీ పన్ను రేట్లను సరళీకరించాలన్నారు.