calender_icon.png 12 October, 2024 | 3:48 PM

వచ్చే రెండు నెలల్లో రూ.60,000 కోట్ల ఐపీవోలు

30-09-2024 12:00:00 AM

లైన్‌లో హ్యుందాయ్, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: వచ్చే అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రైమరీ మార్కెట్లో భారీ పబ్లిక్ ఆఫర్లు హోరెత్తనున్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలతో సహా అరడజను ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) వచ్చే రెండు నెలల్లో రూ.60,000 కోట్ల సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు తెలిపారు.

ఈ మూడు ప్రధాన కంపెనీలకు తోడు షాపూర్జీ పల్లోంజి గ్రూప్ కంపెనీ అఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వారీ ఎనర్జీస్, నివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్, ఒన్ మొబిక్విక్ సిస్టమ్స్, గరుడా కన్‌స్ట్రక్షన్‌లు అక్టోబర్, నవంబర్ నెలల్లో పబ్లిక్ ఆఫర్లు జారీచేయాలని చూస్తున్నాయన్నారు.

ఈ డిసెంబర్ వరకూ దాదాపు 30 ఐపీవోలు ప్రైమరీ మార్కెట్లోకి వస్తాయని ఈక్విరస్ మేనేజింగ్ డైరెక్టర్ మునీశ్ అగర్వాల్ వెల్లడించారు. వివిధ కంపెనీలు వాటి విస్తరణ ప్రణాళికలకు, రుణాల చెల్లింపునకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు నిధులు సమీకరించడానికి, ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటాల్ని విక్రయించడానికి ఐపీవోలు జారీచేస్తునట్లు అగర్వాల్ వివరించారు. 

అతిపెద్ద ఐపీవో హ్యుందాయ్‌దే

దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్‌కి భారత సబ్సిడరీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మెగా ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గతవారమే ఆమోదం తెలిపింది.  హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో ద్వారా 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించాలని కొరియా ఆటో దిగ్గజం భావిస్తున్నది.

ప్రతిపాదిత మొత్తాన్ని సమీకరిస్తే ఇండియాలో ఇప్పటివరకూ వచ్చిన పబ్లిక్ ఆఫర్లు అన్నింటికంటే హ్యుందాయ్ ఐపీవో అతిపెద్దదిగా నిలుస్తుంది. రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేసిన రూ. 21,000 కోట్ల ఇష్యూను మించుతుంది.

సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రమోటింగ్ సంస్థ  హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన సబ్సిడరీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో 14.22 కోట్ల షేర్లను విక్రయిస్తుంది.  భారత్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ వచ్చి రెండు దశాబ్దాలు గడించింది. 2003వ సంవత్సరంలో మారుతి ఐపీవో తర్వాత ఆటోమొ బైల్ ఐపీవో హ్యుందాయ్‌దే అవుతుంది. 

స్విగ్గీ రూ.10 వేల కోట్ల ఆఫర్

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న స్విగ్గీ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 10,414 కోట్ల నిధుల్ని సమీకరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్విగ్గీ ఐపీవోలో రూ. 3,750 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తుంది. మరో రూ.6,664 కోట్ల విలువైన 18.52 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో ప్రస్తుత షేర్‌హోల్డర్లు విక్రయిస్తారు. 

నవంబర్‌లో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్

విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) పునరుత్పాదక ఇంధన సబ్సిడరీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నవంబర్‌లో ఐపీవోను జారీచేయాలని చూస్తున్న ట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించాలన్నది ఎన్టీపీసీ గ్రీన్ ప్రతిపాదన.  

అఫ్కాన్స్ ఇన్‌ఫ్రా రూ.7 వేల కోట్ల ఐపీవో

షాపూర్జీ పల్లోంజి గ్రూప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.7,000 కోట్ల ఆఫర్‌తో ప్రైమరీ మార్కెట్లోకి ప్రవేశించనుంది. సోలార్ మాడ్యూల్స్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్ రూ. 3,000 కోట్లు, నివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ రూ. 3,000 కోట్లు, మొబిక్విక్ సిస్టమ్స్ రూ. 700 కోట్ల ఆఫర్లు జారీచేయనున్నట్టు తెలిపారు.