20-03-2025 12:31:24 AM
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 2025 ఏడాదికి గాను బడ్జెట్‌లో క్రీడాశాఖకు రూ. 465 కోట్లు కేటాయించినట్లు భట్టి ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో వంద కోట్లు అధికంగా కేటాయించినట్లు స్పష్టం చేశారు.
కాగా 2024-25 బడ్జెట్‌లో క్రీడాశాఖకు రూ. 365 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. హకీంపేట్‌లోని 200 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యునివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర శివారులో నిర్మించనున్న స్పోర్ట్స్ యునివర్సిటీ ద్వారా ప్రపంచ స్థాయి అథ్లెట్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు వివిధ కేటగిరీల్లో 12 ప్రత్యేక స్పోర్ట్స్ అకాడమీలు కూడా దీనిలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ సహా అత్యాధునిక సదుపాయాలు స్పోర్ట్స్ హబ్‌లో భాగం కానున్నట్లు వెల్లడించారు.
గతేడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పారా అథ్లెట్ దీప్తి జివాంజీ, బాక్సర్ నిఖత్ జరీన్, భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి వచ్చే అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని భట్టి తెలిపారు.