- పరిపాలనా పరమైన అనుమతులిచ్చిన ప్రభుత్వం
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సమగ్ర ప్రణాళిక
- ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కిశోర్
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే వరంగల్ నగర అభివృద్ధికి రూ.4,170కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులిచ్చింది.
ఈమేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.4,170కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి కమిషనర్ ప్రతిపాదించగా.. తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
వరంగల్ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా అండర్‌గ్రౌండ్, వరద నీటి డ్రైనేజీ, మంచినీటి పంపిణీ, నీటి వనరుల పునరుద్ధరణ, జలాశయ నిర్వహణ ప్రణాళిక, బ్లూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, పవర్, టెలికాం, కేబుల్ వంటి అండర్ గ్రౌండ్ పనులను అభివృద్ధి చేయనున్నారు. వీటికి గానూ మూడు విడతల్లో నిధులు మంజూరు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు.
మొదటి ఫేజ్‌లో రూ.3087 కోట్లు, రెండో ఫేజ్‌లో రూ.597కోట్లు, మూడో ఫేజ్‌లో రూ.486కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ.4,170కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని జీడబ్ల్యూఎంసీ అధికారులను ఆదేశించింది.