హుస్నాబాద్, ఫిబ్రవరి 6 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.44.38 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నారు.
ఇందులో అక్కన్నపేట మండలానికి రూ.4.35 కోట్లు, భీమదేవరపల్లి మండలానికి రూ.6 కోట్లు, కోహెడ మండలానికి రూ.1.95 కోట్లు, సైదాపూర్ మండలానికి రూ.2.70 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధుల నుంచి ఆయా మండలాల్లోని వివిధ గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.15 కోట్లు విడుదల చేస్తూ జనవరి 27న ఉత్తర్వులు వెలువడ్డాయి.
సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సీఆర్‌ఆర్ గ్రాంట్స్ ద్వారా రూ.11.49 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో సైదాపూర్ మండలానికి రూ.2 కోట్లు, చిగురు మామిడి మండలానికి రూ.1.80 కోట్లు, హుస్నాబాద్ మండలానికి రూ.1.5 కోట్లు, అక్కన్నపేట మండలానికి రూ.2.9 కోట్లు, ఎల్కతుర్తి మండలానికి రూ.1.40 కోట్లు, భీమదేవరపల్లి మండలానికి రూ.1.40 కోట్లు మంజూరు చేశారు.
మొత్తం రూ.11.49 కోట్లు విడుదల చేస్తూ గత నెల 28న జీవో విడుదల చేశారు. బీటీ రెన్యువల్ రోడ్ల కోసం రూ.17.89 కోట్లు విడుదల చేస్తూ గత నెల 24న ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇందులో సైదాపూర్ మండలానికి రూ.5.20 కోట్లు, హుస్నాబాద్ మండలానికి 1.625కోట్లు, కోహెడ మండలానికి 1.969కోట్లు, అక్కన్నపేట మండలానికి రూ.9.105కోట్లు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేసిన రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.