ఎల్‌పీజీ సబ్సిడీకి చెల్లించనున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ, జనవరి 9: వ్యయాలు పెరుగుతున్నప్పటికీ, దేశీయ ఎల్‌పీజీ ధరల్ని మార్పుచేయకుండా విక్రయిస్తున్నందున ఏర్పడే నష్టాలను కవర్ చేయడానికి పెట్రో మార్కెటింగ్ కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌కు రూ.35,000 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వరుస రెండేండ్లకు ఈ సబ్సిడీని చెల్లిస్తారు.
2024 మార్చి నుంచి 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ను మార్పులేకుండా రూ.803 వద్దే విక్రయిస్తున్నందున, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40,500 కోట్ల నష్టాన్ని పెట్రో కంపెనీలు భరించాయని, ఇందులో వరుస రెండేండ్లకు రూ.35,000 కోట్లు చెల్లించనున్నట్లు ఆ వర్గాలు వివరించాయి.