ప్యారడైజ్ వద్ద డెలివరీకి సిద్ధమైన నిందితులు
జిన్నారం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
ముగ్గురి అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): నగరంలో మాదకద్రవ్యాలను రూపుమాపడానికి టీజీఏఎన్‌బీ(తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో) యంత్రాంగం తీవ్ర కృషి చేస్తోంది. అందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్‌న్యూ బృందం బోయిన్‌పల్లి పోలీసులతో కలిసి రూ.8.5 కోట్ల విలువైన 8.5 కిలో ల ఎఫిటమిన్ అనే డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివరాలు వెల్లడించారు.
సులువుగా డబ్బు సంపాదించాలనే..
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన కుంచాల నాగరాజు(34) 2007లో సివిల్ వర్క్స్ కాంట్రాక్ట్‌గా పనులు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సంగారెడ్డికి చెందిన వ్యాపారవేత్త గోసుకొండ అంజిరెడ్డితో పరిచయం ఏర్పడింది. అంజిరెడ్డి తన ఫంక్షన్‌హా ళ్లు, ఫ్యాక్టరీలు, గౌడోన్లలో సివిల్ వర్క్స్ కాం ట్రాక్ట్ నాగరాజుకు ఇచ్చేవాడు. అంజిరెడ్డి మాదకద్రవ్యాలు తయారు చేసి, విక్రయించేవాడు. తాను కూడా సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో నాగరాజు అంజిరెడ్డితో కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నాడు.
ఈ ఏడాది జూన్‌లో అంజిరెడ్డి గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో ఉన్న తన డ్రగ్ తయారీ యూనిట్‌కు నాగరాజును పిలిపించి, 3 ఎఫిటమిన్ ప్యాకెట్లను ఇచ్చి దాచి పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే పోలీసులకు డ్రగ్స్ దందాపై సమాచారం రావడంతో కొత్తపల్లి గ్రామంలోని అంజిరెడ్డికి చెందిన డ్రగ్స్ తయారీ యూనిట్‌పై గుమ్మడిదల పోలీసులు దాడి చేశారు. మాదకద్రవ్యాలను సీజ్ చేసి అంజిరెడ్డిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు.
డెయిరీ ఫామ్ రోడ్డు వద్ద అరెస్టు
అంజిరెడ్డి తనకిచ్చిన 3 ఎఫిటమిన్ ప్యాకెట్లను విక్రయించేందుకు ఆదివారం రాత్రి కుంచాల నాగరాజు మరో ఇద్దరు ఆశాగౌని వినోద్‌కుమార్ గౌడ్(32), మేడ్చల్ జిల్లా దుండిగల్‌కు చెందిన కుంటి శ్రీశైలం(42)తో కలిసి జిన్నారం నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వాటిని బోయిన్‌పల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద డెలివరీ చేయనున్నట్టు తెలుసుకున్నారు. కారులో వెళ్తున్న నిందితులను నార్కొటిక్ వింగ్ పోలీసులు బోయిన్‌పల్లి పోలీసులతో కలిసి డెయిరీ ఫామ్ రోడ్డు వద్ద పట్టుకున్నారు.
నిందితుల నుంచి రూ.8.5 కోట్ల విలువైన డ్రగ్స్‌ను, కారు, 3 సెల్‌ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ దందా వెనక మరేవరైనా ఉన్నారా? ఎవరికి సరఫ రా చేయడానికి వచ్చారనే కోణంలో దర్యా ప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహారించిన కమిషనర్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవిఎస్ సుదీంధ్ర, నార్త్‌జోన్ డీసీపీ రష్మీపెరుమాళ్, హెచ్‌న్యూ ఇన్‌స్పెక్టర్లు కె శ్రీనివాస్, జీఎస్ డానియెల్, ఎస్సై వెంకటరాములు, బి లక్ష్మినారాయణరెడ్డి, శివశంకర్‌లను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
యువతకు సీపీ స్పెషల్ రిక్వెస్ట్
డ్రగ్స్‌కు బానిసలై యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సీపీ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టామని, డ్రగ్స్ అలవాటు చేసుకునే వారిపైనే కాదు.. అలవాటు చేసే వారిపై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. తెలియని వ్యక్తులతో పార్టీలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
ధూల్‌పేట్‌లో గంజాయి విక్రేతల అరెస్టు
ధూల్‌పేట్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ధూల్‌పేట్‌కు చెందిన మహేందర్‌సింగ్ (26), ఒడిశాకు చెందిన దంపతులు భర త్ అల్యానా(52), పద్మ తులా అల్యానా (45), మంగళ్‌హట్‌కు చెందిన సుమన్ భాయ్(35), కాటేధాన్‌కు చెందిన అమర్ సింగ్(28) ముఠాగా ఏర్పడి సిటీలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు. సమాచారం అందడంతో సోమవారం కమిషన ర్ టాస్క్‌ఫోర్స్, సౌత్‌వెస్ట్ జోన్ బృందం మంగళ్‌హాట్ పోలీసులతో కలిసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3.10 లక్షల విలువైన 10 కేజీల ఎండు గంజాయి, రూ.3వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.