calender_icon.png 29 September, 2024 | 4:51 AM

రూ.5.27 కోట్ల సైబర్ మోసం

28-09-2024 12:05:53 AM

నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన నలుగురి అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కమిషన్‌కు కక్కుర్తి పడి సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న నలుగురు నిందితులను టీజీసీఎస్బీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తి జూలై 11న ఫేస్‌బుక్‌లో షేర్ మార్కెట్ సంబంధించి ఓ ప్రకటనను చూశాడు.

ఆకర్షితుడైన బాధితుడు ఆ లింక్‌పై క్లిక్ చేయగా, వాట్సప్ గ్రూప్‌లోకి యాడ్ అయ్యాడు. గ్రూపులో అంకుర్ కేడియా అనే వ్యక్తి ప్రధాన పెట్టుబడిదారుడిగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడు అడ్మిన్లు సూచించిన విధంగా షేర్ల కొనుగోలు ప్రారంభించాడు. ఇలా మొత్తం రూ. 5.27 కోట్లు పెట్టి పలు కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేసి విక్రయించసాగాడు.

వచ్చిన డబ్బును బాధితుడు విత్‌డ్రా చేసుకుందామని ప్రయత్నించగా కేవలం రూ. 45 వేలు మాత్ర మే విత్‌డ్రా చేసుకోగలిగాడు. తర్వాత తన ఖాతా ఫ్రీజ్ చేసినట్లు చూపించడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుతో ప్రమేయం ఉన్న వనస్థలిపునరానికి చెందిన కొత్తండ రామన్ మురళీకృష్ణన్, రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడకు చెందిన కందుకూరి రవీందర్‌రెడ్డి, అత్తాపూర్‌కు చెందిన బండ్లమూడి రవి, జీడిమెట్లకు చెందిన సామినేని మాధవరావును అరెస్ట్ చేశారు.

వీరంతా కమిషన్‌కు కక్కుర్తి పడి సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చినట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించారు. వీరు ఒక్కో బ్యాంకు ఖాతాకు సైబర్ నేరగాళ్ల నుంచి రూ.5 వేలు అందుకున్నట్లు నిందితులు తెలిపారు. ఈ కేసులో గత వారం పశ్చిమబెంగాల్‌కు చెందిన నిందితుడు  సైదుల్ ఇస్లాం ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.