calender_icon.png 9 October, 2024 | 1:56 PM

10.61 కోట్ల సైబర్ క్రైమ్

09-10-2024 01:31:48 AM

బ్యాంకు ఖాతాలు సమకూర్చిన ఇద్దరు నిందితుల అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : ముంబై పోలీసులమంటూ ఫోన్ చేసి నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 10.61 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లను టీజీసీఎస్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 10న నగరానికి చెంది న ఓ వ్యక్తికి ముంబై పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.

మీ ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి బ్యాంకు ఖాతా తెరిచి, మనీలాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేస్తే 3 నుంచి 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని భయపెట్టారు. ఆర్బీఐ సూచనల మేరకు మీ ఖాతాలోని డబ్బును విచారణ నిమిత్తం తాము సూచించిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తామని చెప్పారు.

ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ. 10.61 కోట్లను బదిలీ చేశాడు. అయినా వారి వేధింపులు కొనసాగుతుండటంతో భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు నగదు ఏ ఖాతాల్లోకి బదిలీ అయ్యిందని తెలుసుకున్నారు.

బాధితుడి మొత్తం రూ.10. 61 కోట్లలో బెంగుళూరుకు చెందిన ‘టింకాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ జాయింట్ కరెంట్ ఖాతాలో 4.62 కోట్లు జమయ్యాయ ని పోలీసులు గుర్తించారు. 

బ్యాంకు ఖాతా ఆధారంగా నిందితులు కర్ణాటకకు చెందిన వినయ్‌కుమార్ ఎస్.కడ్కే, మారుతి జీహెచ్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) బృందం మంగళ వారం అరెస్ట్ చేశారు. నిందితులిద్దరు కలిసి జాయింట్ బ్యాంకు ఖాతా తెరిచి సైబర్ నేరగాళ్లకు అందించినట్లు పోలీసులు గుర్తిం చారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు.