calender_icon.png 28 November, 2024 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1.33 కోట్ల యాంటీ బయోటిక్స్ సీజ్

28-11-2024 01:23:44 AM

  1. తయారీ ఒక చోట.. ప్యాకింగ్ మరోచోట 
  2. సిద్దిపేట నుంచి రష్యాకి పంపిస్తుండగా పట్టివేత

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి)/ గజ్వేల్: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాలో ఔషధాల లభ్యత తగ్గింది. దీంతో ఆ దేశం ఔషధాల కోసం ఇతర దేశాలపై అధారపడుతున్నది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు గజ్వేల్ ప్రాంతంలోని ఓ ఫార్మాకంపెనీ రంగంలోకి దిగింది.

ఏకంగా నకిలీ మెడిసిన్‌ను రష్యాకు పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. సమాచారం అందుకున్న  డ్రగ్ కంట్రోల్ కంపెనీలో దాడులు నిర్వహించి యాజమాన్యం అక్రమాలను గుట్టురట్టు చేసింది. డీజీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కరకపట్ల బయోపార్క్‌లోని ‘జోడాస్ ఎక్సో పోయిం ప్రైవేట్ లిమిటెడ్’కు యాజమాన్యానికి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోనూ పరిశ్రమ ఉంది.

అక్కడి కంపెనీ రష్యాకు యాంటీ బయోటిక్స్ సరఫరా చేసి, అక్రమంగా సొమ్ము గడించేందుకు వక్రమా ర్గం పట్టింది. తన కంపెనీలో యాంటీ బయోటిక్స్ తయారు చేయించకుండా, హైదరాబాద్ చర్లపల్లిలోని ఇండియన్ జీనోమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్రలోని వాసాయి జెజెయ్ ఫార్మాలో తయారైన యాంటీ బయోటిక్స్ ఇంజక్షన్లను తామే తయారు చేసినట్లుగా ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ చేసి ఎగుమతి చేసేందుకు నకిలీ మెడిసిన్‌ను సిద్ధం చేసింది.

సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్ విభాగం అడిషనల్ డైరెక్టర్ పి రాము, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కరకపట్ల బయోపార్క్‌లోని కంపెనీలో దాడులు చేశారు. రష్యాకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన రూ.1.33 కోట్ల విలువైన 38,175 యాంటీ బయోటిక్స్‌ను సీజ్ చేశారు. యాజమాన్యంపై విచారణ జరుగనున్నది.