05-04-2025 01:41:32 AM
180 ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంటలు పరిశీలించిన అధికారులు
66.5 ఎకరాల్లో మామిడి బొప్పాయి మునగ తోటల నష్టం
గజ్వేల్, మార్చి4: గజ్వేల్ డివిజన్లో గురువారం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. శుక్రవారం ఉదయం నుండి వడగండ్ల వాన వల్ల కలిగిన పంట నష్టాన్ని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. వడగళ్ల వర్షానికి గజ్వేల్ మండల పరిధిలోని ధర్మారేడ్డి పల్లి, సంగుపల్లి, కోమటిబండ, జాలిగామ, గజ్వేల్ గ్రామాల శివారులోని మొక్కజొన్న, వరి పంటలను తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఎడిఎ బాబు నాయక్ తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారుగ 54 ఎకరాలలో మొక్కజొన్న, ,126 ఎకరాల వరి పంట వడగళ్ల వానకు దెబ్బతిన్నట్లు తెలిపారు. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు వెల్లడించినట్లు ఏడిఏ బాబు నాయక్, ఏవో నాగరాజులు వెల్లడించారు.
వారి వెంట ఎఈఓ నలీన్, రైతులు ఉన్నారు. అలాగే గజ్వేల్ హార్టికల్చర్ పరిధిలో నీ గజ్వేల్ మండలంలో 35 ఎకరాలలో మామిడి తోట, 8 ఎకరాలు బొప్పాయి తోట, వర్గల్ మండలంలో 7 ఎకరాలలో మామిడి సపోటా, 8.20 ఎకరాలలో బొప్పాయి తోట వడగండ్ల వానకు దెబ్బతిన్నట్లు హార్టికల్చర్ అధికారి రమేష్ తెలిపారు. అలాగే రాయపోల్ మండలంలో మునగ తోట ఎకరం, 7 ఎకరాలలో మామిడి తోట కు నష్టం వాటినట్లు తెలిపారు. పంట నష్టం 33 శాతం కంటే తక్కువగానే ఉండడంతో రైతులకు ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం వచ్చి అవకాశం లేకుండా పోయింది. కానీ మొత్తంగా చూస్తే రైతులు వేల రూపాయలు నష్టపోయినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా రైతులు కోరుతున్నారు.