calender_icon.png 24 September, 2024 | 3:57 AM

సాగర్‌లో నీరున్నా పంటలు ఎండుతున్నయ్

24-09-2024 12:43:10 AM

  1. కాంగ్రెస్‌కు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు తెలియవు
  2. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల నాగార్జున సాగర్‌లో నీరు ఉన్నా ఆయకట్టు ప్రాంతంలో పంటలు ఎండుతున్నాయని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం ప్రజలు కాంగ్రెస్‌కు 9 మంది ఎమ్మెల్యేలను ఇస్తే.. ఆ జిల్లాలోని మూడు లక్షల ఎకరాలను ఎండబెట్టారన్నారు.

ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులు ఎన్‌ఎస్పీ ఆఫీసులను రైతులు ముట్టడిస్తున్నారని... పార్టీలకతీతంగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా గండిపడిన కాల్వ పక్క నుంచే వెళ్తున్నారు తప్పా పరిష్కారం చూపడం లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావని అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం వచ్చుగానీ.. రైతులకు నీరు ఇవ్వడం రావడం రాదన్నారు.

ఆగస్టు 15న సీఎం రేవంత్ ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్టును ప్రారంభించి, 70 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారని, అయితే ఆ ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై ఇంటిమీద జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ దాడికి బాధ్యత వహించాలన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.