08-04-2025 01:44:38 AM
డీడీఎస్‌లో అక్రమాలపై పిడికిలెత్తిన మహిళా రైతులు
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతమైన జహీరాబాద్‌లో సేంద్రీ య వ్యవసాయం, విత్తన సంరక్షణతో పాటు చిరుధాన్యాలు పెద్దఎత్తున పండించే రైతులకు అండగా నిలిచింది. ముఖ్యంగా జొన్నల సాగులో డీడీఎస్ పరిధిలో ఉండే రైతుల విజయగాథలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
ఫలితంగా వివిధ దేశాల నుంచి పెద్దఎత్తున ఆర్థిక సాయంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా డీడీఎస్‌కు ఆర్థికంగా సహకారం లభించింది. దాంతో అనేక కార్యక్రమాలతో డీడీఎస్ అభివృద్ధి పథంలోకి వచ్చింది. అయితే ఇటీవల వెయ్యిమంది మహిళలు ఈ సొసైటీపై జిల్లా కలెక్టర్, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో సంస్థపై ఒక్కసారిగా అవినీతి మేఘాలు కమ్ముకున్నాయి.
103 ఎకరాలను అమ్ముకున్నారు..
డీడీఎస్‌తో పాటు మహిళా సంఘాలు సభ్యులుగా ఉన్న బాల్వాడీ భూములను, స్థానిక మహిళా రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా కొందరు తమకు అను కూలంగా ఉన్న మహిళలతో సంతకాలు తీసుకుని కోట్లాది రూపాయల విలువైన 103 ఎకరాల భూములను అమ్ముకుందని వ్యవస్థాపక డైరెక్టర్ అయిన కేఎస్ గోపాల్ విజయక్రాంతికి తెలిపారు.
రైతులు సరిగా పంటలు పండించడం లేదనే సాకుతో భూ ములు అమ్ముకున్నారని, రైతులకు చెందిన డబ్బులను లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. డీడీఎస్ అంతా అక్రమాల పుట్ట అని తెలిపారు. డీడీఎస్‌గా డైరెక్టర్‌గా ఉన్న పివి సతీష్ హాస్పిటల్ ఖర్చుల కోసం డీడీఎస్‌కు చెందిన రూ. 2.30 కోట్ల నిధులను అక్రమంగా ఖర్చు చేశారని ఆయన వెల్లడించారు.
ఒక ఎన్జీఓకు చెందిన కోట్లాది రూపా యల నిధులను వ్యక్తిగత అవసరాలకు మళ్లించడం చట్టరీత్యా నేరమని తెలిసినా డీడీఎస్ సభ్యులు తమకు తోచిన విధంగా చేస్తూ పోయారని, దీంతో ఈ సంస్థపై ఆధారపడిన వేలాది మంది మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని జహీరాబాద్‌కు చెందిన మహిళా రైతులు ఆరోపిస్తు న్నారు.
ఆర్థిక లావాదేవీలను దాదాపుగా 15 ఏళ్లుగా బయటకు పొక్కకుండా డీడీఎస్ నిర్వాహకులు మహిళలకు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారిమళ్లించారని తెలుస్తోంది. నిరక్షరాస్యులైన మహిళలు తమకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం ఇప్పుడు పోరాటం చేస్తున్నారు.
పారదర్శకతకు పాతర..
జహీరాబాద్ తాలూకాకు చెందిన మహిళలు తమ -పొదుపులను డీడీఎస్ పర్యవే క్షించే సామూహిక నిధిలో పొదుపు చేసుకున్నారు. అవసరమైనప్పుడు రుణాలు తీసుకు నేందుకు వారు ఈ నిధిని వినియోగించుకునే వారు. డిపాజిట్లు, ఉపసంహరణలను నమోదు చేసేందుకు వారికి పాస్‌బుక్కులు కూడా ఇచ్చారు. అయితే కాలక్రమంలో ఈ వ్యవహారాలను నిలిపివేశారు.
మహిళలు పొదుపు చేసుకున్న నిధులు అసలు, వడ్డీతో సహా మొత్తం పొదుపు రూ. 3 నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుంది. మహిళా రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన ఈ నిధి ఇప్పుడు వడ్డీతో సహా భారీగా పెరిగిపోయింది. అయితే దానిపై కనీసం లెక్కలు కూడా చెప్పడం లేదని మహిళా రైతులు వాపోతున్నారు.
దీంతో గత్యంతరం లేక డీడీఎస్‌పై వెయ్యి మంది మహిళా రైతులు 2024లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారే కానీ బాధ్యులపై కనీసం చర్యలు తీసుకునడం లేదని మహిళలు వాపోతున్నారు.
రివాల్వింగ్ ఫండ్ కూడా దుర్వినియోగం
1998 మధ్య జొన్నల ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం రూ. 12 కోట్లను డీడీఎస్ సేకరించింది. 2006లో రూ. 62.68 లక్షల రివాల్వింగ్ ఫండ్‌ను సంఘాల అనుమతి లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలోకి బదిలీ చేశారు. దాతల పర్యవేక్షణ 2005లో ముగియడంతో మహిళా రైతులు తమ నిధులు మాయమైనట్లు గుర్తించారు. 20 ఏళ్ల చక్రవడ్డీతో కలిపి ఇప్పుడు రివాల్వింగ్ ఫండ్ రూ.5 కోట్లు దాటిందని తెలుస్తోంది.
డీడీఎస్‌ను ఆగం చేసిండ్రు
ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన డీడీఎస్‌ను కొందరు ఆగం చేసిండ్రు. సంస్థ డబ్బులను సొంతానికి వాడుకున్నారు. ఒకప్పుడు ఎంతోబాగా ఉన్న ఈ సంస్థను కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేశారు. మేమంతా ఈ సంస్థను నమ్ముకుని బతికినం. ఇప్పుడు కొందరి తీరువల్ల సంస్థకు ఈ దుస్థితి వచ్చింది. దీనిపై మేమంతా పోరాటం చేస్తాం.
రైతు, పిడకళ్ల
మా భూములు మాకు కావాలి
7 ఎకరాల భూమి బాల్వాడీ భూములున్నాయి. వాటి ద్వారా మేం చాలా ఉపాధి పొందాం. మాకు తెలియకుండానే కొందరి సంతకాలు తీసుకుని భూములు వేరే వాళ్లకు అమ్ముకున్నారు. వాటిపై ఆధారపడి జీవిస్తున్నాం. కాబట్టి మా భూములు మాకు కావాల్సిందే. డీడీఎస్‌కు పేరు వచ్చేందే మా వల్ల. కానీ వారు మమ్మల్నే మోసం చేశారు. మేం పొదుపు చేసుకున్న డబ్బులన్నీ డీడీఎస్ ఖాతాల్లో ఉన్నాయి. వాటిని ఎవరివి వారికి పంచాల్సిందే.
శారద, రైతు, బసంత్‌పూర్
భూములను అమ్ముకున్నారు..
కేఎస్ గోపాల్, డీడీఎస్ వ్యవస్థాపక డైరెక్టర్
మేం ఎంతో కష్టపడి 1981లో డీడీఎస్‌ను ప్రారంభించాం. అంతా బాగానే ఉంద నుకున్న దశలో నేను మిగతా వారికి బాధ్యతలు అప్పగించి విదేశాలకు వెళ్లిపోయా ను. 2023లో డీడీఎస్ డైరెక్టర్‌గా ఉన్న సతీష్ మృతిచెందడంతో తిరిగి జహీరాబాద్ వచ్చాను. అప్పుడే ఇక్కడి అక్రమాలపై మహిళలు అంతా నా దృష్టికి తీసుకొచ్చారు. 2000 వరకు భారీగా విదేశీ, స్వదేశీ నిధులు వచ్చాయి. సంస్థకు ఎంతో పేరుండేది.
కానీ క్రమంగా వీరు సంస్థ నిధులను పక్కదారి పట్టించారు. డీడీఎస్‌ను నమ్ముకున్న మహిళా రైతులను వంచించారు. 30 ఏళ్లుగా కనీసం జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా అందరినీ మోసం చేస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన 103 ఎకరాలను దొంగచాటుగా అమ్ముకున్నారు.
సంస్థ నిధులు కోట్లాది రూపాయలను సొంతానికి వాడుకున్నారు. వీరి అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు నేను కోర్టుకు కూడా వెళ్లాను. ప్రస్తుతం సొసైటీల రిజిస్ట్రార్‌కు వీరి అక్రమాలపై ఫిర్యాదు చేశాను. విచారణ జరిపిస్తామని చెప్పారు. రివాల్వింగ్ ఫండ్ డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకున్నారు.
అవే దాదాపు రూ. 40 నుంచి రూ. 50 కోట్ల వరకు ఉంటాయి. ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన డీడీఎస్‌ను, మహిళా రైతులను వంచించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్న వారు మూల్యం చెల్లించుకోక తప్పదు.