దెబ్బతిన్న పత్తి, వరి పంటలు
పరిహారం రూ. 15 వేలు అందజేయాలని వేడుకుంటున్న అన్నదాతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 7.50 లక్షల ఎకరాల్లో పంటలు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా పత్తి, వరి పంటలే దెబ్బతిన్నట్లు చెబుతు న్నారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో పెద్దమొత్తంలో రైతులకు పంటనష్టం జరిగిందన్నారు. పంటనష్టంపై స్థానిక అధికారులతో త్వరలో నివేదిక తెప్పించుకుంటామని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెప్పారు.
సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, వనపర్తి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వానలకు పంటలు ఎక్కువగా ఖమ్మం జిల్లాలోనే సుమారు 3.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. ఈ వానాకాలంలో రైతులు 86 లక్షల పంట సాగుచేశారు. అందులో ఎక్కువ శాతం పత్తి.. 42 లక్షల ఎకరాల్లో సాగుచేయగా సుమారు 4.50 లక్షల వరకు, వరి పంట 26 లక్షల ఎకరాల్లో నాట్లు వేయగా వరదలకు 1.50 లక్షల వరకు నష్టం జరిగినట్లు వెల్లడిస్తున్నారు.
అదే విధంగా మక్క 4.07 లక్షల ఎకరాల్లో సాగు చేయగా సుమారు 50 వేల ఎకరాలు, అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 4.98 లక్షల ఎకరాల్లో సాగు చేయగా 30 వేల ఎకరాలు, కంది 4.17 లక్షల ఎకరాల్లో వేయగా 40వేల ఎకరాలు దెబ్బతి న్నట్లు వెల్లడించారు. పెసర్లు 61,580 ఎకరాలు, జొన్న పంట 31,815 ఎకరాలు, రాగులు కేవలం 176 ఎకరాల్లోనే సాగు చేయగా మొ త్తంగా చిరుధాన్యాల పంటకు 25 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. కొర్రలు, సామలు, అరికెలు 401 ఎకరాల్లో సాగు చేయగా 70 ఎకరాల వరకు దెబ్బతిన్నట్లు చెప్పారు.
ఆందోళనలో పత్తి రైతులు
గత మూడు రోజులుగా కురిసిన వానలకు పత్తి పంట బాగా దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాధార పంట కావడంతో ఈ ఏడాది సాగు చేసేందుకు మొగ్గు చూపారు. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. వచ్చే నెలలో మొదటిసారి పత్తి తీసేందుకు సిద్ధం కాగా కురిసిన వానలకు పత్తి తడిసి ముద్దగా మారింది. కొన్ని చోట్ల పూర్తిగా నేల రాలింది. మొదటి కాతలో క్వింటాల్ రూ.12 వేల నుంచి రూ.15 వేల ధర పలుకుతుందని ఆశిస్తే మూడు రోజుల ముసురు తమను అప్పులపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట పరిహారం కింద ఎకరానికి రూ.15 వేల వరకు సాయం అందించాలని కోరుతున్నారు.
పంట నష్ట వివరాలు సేకరణ
పంట నష్టంపై తక్షణమే అధికారులు రంగంలోకి దిగి వివరాలు సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ అధికారులు 1.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన డంతో 4 లక్షల ఎకరాల్లో జరిగినట్లు ప్రచా రం జరుగుతుందని వెంటనే అంచనా వేయాలని సూచించారు. కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు పరిహారం అంద జేశామని, ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం బృందాలు కూడా పంట నష్టపరిశీలనకు ఏర్పాట్లు చేయాలన్నారు. వరదలకు చనిపోయిన పాడిపశువులకు పరిహారం రూ. 50వేలు, మేకలు, గొర్రెలకు రూ. 5 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.