గతనెలలో కరిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంట
- ఆరేండ్లుగా నిలిచిన కేంద్ర పథకం
- ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న రైతులు
- పరిహారం అందక అన్నదాతల ఆక్రందణ
మెదక్, నవంబర్ 14(విజయక్రాంతి): ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు చేయూతనిచ్చేందుకు కేంద్రం తీసు కొచ్చిన ఫసల బీమా పథకం జిల్లాలో జాడలేకుండా పోయింది. దీంతో అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పైసా పరిహారం అందక అప్పులపాలవుతున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రాష్ట్రంలో ఆరేండ్లుగా ఫసల్ బీమా పథకం అమలుకు నోచుకోవడం లేదు. గత మూడేండ్లుగా భారీవర్షాలు, వరదల కారణంగా జిల్లాలో పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులకు అందాల్సిన పరిహారం అందని ద్రాక్షగానే మిగిలింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ఈ పథకంలో పలు లోపాలు ఉన్నాయని గత ప్రభుత్వం పక్కనబెట్టింది.
గతంలో కేంద్ర ప్రభుత్వం 40 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, రైతులు 20 శాతం పంట బీమా ప్రీమియం చెల్లించేవారు. కానీ కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. దీంతో రైతులకు బీమా వర్తించడం లేదు.
మార్గదర్శకాల జాడేది?
ఫసల్ బీమా యోజన పథకాన్ని పునరుద్ధరించాలని ప్రస్తుత ప్రజాప్రభుత్వం నిర్ణ యించింది. పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందించేలా కసరత్తు చే స్తోంది. రైతులపై ఆర్థికభారాన్ని తగ్గించేందు కు ప్రభుత్వమే 100 శాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కానీ నేటికీ మార్గదర్శకాలు విడుదల కాలేదు. యాసంగి సీజన్‌లో పంట బీమాను అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
బీమా అందించాలి
కష్టపడి సాగు చేసిన పంటలకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లుతుంది. వర్షాలు, వరదలు పంటలను నిండా ముంచుతున్నాయి. పంట సాగు ఆరంభంలోనే పంటలు నష్టపోవడంతో పెట్టుబడి అప్పుగా మిగిలింది. ప్రభు త్వం బీమా సౌకర్యం కల్పించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
- తన్నీరు రాములు, రైతు, వెల్దుర్తి
మార్గదర్శకాలు రాలేదు
పంట బీమా అమలు విషయంలో వ్యవసాయ శాఖకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం గతంలో నిర్వహించింది. కానీ కొన్నేళ్లుగా గత ప్రభుత్వం నిలిపేసింది. ప్రభుత్వం ఆదేశాలిస్తే ఫసల్ బీమా అమలుకు చర్యలు తీసుకుంటాం.
- గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి, మెదక్