calender_icon.png 21 October, 2024 | 5:00 AM

యాసంగి నుంచి ఫసల్ బీమా!

21-10-2024 02:09:31 AM

ఐదేళ్ల తరువాత మళ్లీ ప్రారంభిస్తున్న సర్కార్  

ఇటీవల జరిగిన పంట నష్టంతో ముందు జాగ్రత్త చర్యలు

రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఇప్పటికే గైడ్‌లైన్స్ ప్రభుత్వానికి అందజేత

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ నుంచి ప్రధానిమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేసేందుకు ప్రయత్నాలు వేగం చేస్తోంది. ఇప్పటికే స్థానికి వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించి ఫసల్ బీమాలో చేరాలని సూచిస్తున్నారు. ప్రకృతి వైఫరీత్యాల నుంచి కాపాడుకునేందుకు ఎంతో ఉపయో గపడుతుందని వివరిస్తున్నారు.

వానాకాలం నుంచి ఉచిత పంట బీమా అమలు చేయాలని ప్రయత్నాలు చేయగా, ఆర్థికపరమైన సమస్యలతో ఆ పథకం కాగితాలకే పరిమితమైంది. ఇటీవల కురిసిన వానలకు పంట నష్టం జరగడంతో ప్రభుత్వం ఎకరానికి రూ. 10 వేల నష్ట పరిహారం అందించింది. పంట బీమా ఉంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండదనే భావనతో రబీ నుంచి  ఖచ్చితంగా ఫసల్ బీమా యోజనను అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఐదారు రోజుల నుంచి పలు జిల్లాలో రైతులకు ఫసల్ బీమా ప్రయోజనాలను వివరిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల కారణంగా పంట నష్టపోకుండా ఆర్థిక సంరక్షణ కల్పించేందుకు ఫసల్ బీమా పనికొస్తుందని చెబుతున్నారు.

పాత విధానంలోనే బీమా..

 కేంద్రం ప్రభుత్వం  ఈ పథకం 2016లో ప్రారంభించగా తెలంగాణ ప్రభుత్వం 2019 వరకు రైతులకు బీమా అమలు చేసింది. తరువాత ఫసల్ బీమా పథకం నుంచి వైదొలగింది. అప్పటి నుంచి పంట నష్టం జరిగితే రైతులు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఎదురు చూసే రోజులు వచ్చాయి. వీటిని గుర్తించిన రేవంత్ సర్కార్ ఉచిత బీమా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అసలు బీమా లేకుంటే కష్టమని, పాత విధానంలో ఫసల్ బీమాను అమలు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ బీమా పథకం ఇది. ఇది 50 కోట్ల మంది రైతులకు వర్తించడంతో పాటు 50కిపైగా వివిధ పంటలకు బీమా అందిస్తోంది. 

బీమా గైడ్‌లైన్స్ సిద్ధం.. 

వానాకాలం పంటలకే వ్యవసాయ శాఖ బీమాకు సంబంధించిన గైడ్‌లైన్ కూడా సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో ప్రతి గ్రామం యూనిట్‌గా, వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రాప్ ఇన్సూరెన్స్ అమ లు చేసే విధంగా  రూపొందించింది. ఈ ఏడాది రెండు పంటలకు కలిపి రాష్ట్రంలో 1.32 కోట్ల ఎకరాల్లో పంట సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ పథకం కింద బీమా ప్రయోజనాలు పొందడానికి రైతులు ఖరీప్ పంటకు 2 శాతం, రబీ పంటకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం యాక్చురియల్ ప్రీమియంలో నామమాత్రపు వాటాను చెల్లించాలి. 95 నుంచి 98 శాతం యాక్చురియల్ ప్రీమియం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెల్లించాలి. బీమాలో తృణధాన్యాలు, నూనె గింజలు, పప్పుదాన్యాలు, వరి, పత్తి, చెరకు, ఉద్యానవన పంటలతో సహా వివిధ పంటలకు బీమా వర్తిస్తుంది. పథకం కింద నిర్ధిష్ట దిగుబడుల పాలసీని తీసుకునే రాష్ట్రాన్ని బట్టి బీమా మారుతుంది. వివిధ రాష్ట్రాలు ఇతర పంటలకు ఎక్కువగా బీమాను కలిగి ఉంటాయి. 

పరిస్థితులకు అనుగుణంగా బీమా పథకం..   

అకాల వర్షాలతో నష్టం జరిగితే ఒక రకంగా, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు నష్టం జరిగితే మరో విధంగా, దిగుబడి చాలా స్వల్పంగా వస్తే పరిహారం అందించేందుకు ఇంకో విధంగా ఆయా గ్రామాల పరిస్థితులకు అనుగుణంగా స్కీమ్‌ను అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధావిధానాలను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందిం చింది. పంటల బీమా కోసం నిర్వహించే టెండర్లలో బీమా కంపెనీలు కోట్ చేసే ప్రీమియం ధరను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుంటుందని అధికారులు చెప్పారు.