ఫిబ్రవరి 7కు వాయిదా
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో చోటుచేసుకున్న కార్చిచ్చు ఘటన వల్ల క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక మరోమారు వాయిదా పడింది. అక్కడ మంటలు ఇంకా అదుపులోకి రాకపోవటంతో ఈ వేడుకను వాయిదా వేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను జనవరి 12న నిర్వహించాలని భావించారు. కానీ అప్పటికే లాస్ ఏంజెలెస్‌లో మంటలు చెలరేగటంతో అవి జనవరి 26వ తేదీకి వాయిదా వ ఏశారు.
ఆ కార్చిచ్చు ఇప్పటికీ అదుపులోకి రాకపోవటంతో ఫిబ్రవరి 7కు వేడుకలను మరోసారి రీ షెడ్యూల్ చేశారు. శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్‌లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్టు సంస్థ పేర్కొంది. ఇందుకు సంబంధించి నామినేషన్లను జనవరి 23న ప్రకటించనున్నట్టు తెలిపారు.
మరోవైపు ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు రద్దయ్యే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపైనా అకాడమీ సభ్యులు స్పందించారు. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆస్కార్ వేడుకల్లో మార్పు ఉండదని తెలిపారు. 96 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఈ ఈవెంట్ క్యాన్సిల్ కాలేదని, కొవిడ్ సమయంలోనూ వాయిదా మాత్రమే వేసినట్టు గుర్తు చేశారు.