calender_icon.png 20 October, 2024 | 6:07 PM

అసహనంతో విపక్షాలపై విమర్శలు

20-10-2024 01:28:15 AM

మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  కొన్ని నెలలుగా అసహనంతో విపక్ష పార్టీలపై విమర్శలు చేస్తున్నాడని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారాం యాదవ్, దూదిమెట్ల బాలరాజుతో కలిసి ఆయన మాట్లాడారు.

ఎలాగో సీఎం అయ్యేది లేదని ఎన్నికల సందర్భంగా రేవంత్ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చి వాటిని నెరవేర్చలేకే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నాడన్నారు. అసలు తాము గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకోలేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. తాను ఎంతకాలం సీఎంగా ఉంటానో తెలియని రేవంత్.. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకునేందుకు ధన దాహం ప్రదర్శిస్తున్నాడన్నారు. పదవిని కాపాడుకోడానికే ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని ఆరోపించారు.

గత డిసెంబర్ 9 సోనియా పుట్టిన రోజున మొత్తం రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి తుమ్మల మళ్ళీ మాట మార్చారని పేర్కొన్నారు. రైతు భరోసా ఇచ్చే వరకు బీఆర్‌ఎస్ సీఎం రేవంత్‌ను వదిలి పెట్టదన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారని, రేవంత్ పదవి పోతుందని బండి సంజయ్ తెగ బాధప డిపోతున్నారని పేర్కొన్నారు.