రుణమాఫీపై అపోహలు వద్దు.
అధికారులు రైతుల సమస్యలు పరిష్కరించాలి.
ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు రైతు రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో రైతు వేదికను సందర్శించి ఏఈఓ, రైతులతో రుణమాఫీ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ అంశంపై ఎలాంటి అపోహలు వద్దని ప్రతి రైతుకి రుణమాఫీ అమలు జరిగి తీరుతుందన్నారు. రుణమాఫీ అందలేదని లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అర్హులై ఉండి రుణమాఫీ కానీ వారి లిస్టును అందించాలని చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వెంటనే వాటిని సరిచేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతి రైతుకు న్యాయం చేయడమే తన లక్ష్యమని అన్నారు.