calender_icon.png 25 October, 2024 | 1:44 AM

సీఎం పర్యటనపై విమర్శలు సరికాదు

09-08-2024 02:11:19 AM

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ 

హైదరాబాద్,ఆగస్టు8(విజయక్రాంతి): రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరి కా పర్యటనకు వెళ్తే.. బీఆర్‌ఎస్ నాయకు లు ఓర్చుకోవడం లేదని, కావాలనే పనిగట్టుకొని సీఎం కుటుంబంపై విషం కక్కు తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ విమర్శించారు. సీఎం అమెరికా పర్యటనను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఒకవైపు స్వాగతిస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ నేతలు బాల్క సుమన్, క్రిశాంక్ విరుద్ధంగా మాట్లాడటమేంటి అని ప్రశ్నించా రు. గురువారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు భవానిరెడ్డి, అల్లం భాస్కర్‌తో కలిసి సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజాయాన్ని మూటగట్టుకున్న బీఆర్‌ఎస్ నాయకులు.. నైరాశ్యంలో ఏమి మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరులపై అనవసర ఆరోపణలు సరికాదన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికే అత్యున్నత పదవులు దక్కాయని.. కాంగ్రెస్ 8నెలల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులకు ఎక్కడా పదవులు ఇవ్వలేదన్నారు. భద్రాచలం శ్రీరాముడి కల్యాణానికి కేసీఆర్, ఆయన మనమడు తలంబ్రాలు తీసుకెళ్లారని.. కుటుంబ పాలన అంటే కేసీఆర్‌ది అని, రేవంత్‌రెడ్డిది కాదని సంపత్‌కుమార్ హితవు పలికారు.