calender_icon.png 15 March, 2025 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యసభ చైర్మన్‌పై విమర్శలు

17-12-2024 12:00:00 AM

భారత 14వ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌గా జగదీప్ ధన్‌కర్ దేశ రాజకీయాల్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగిఉన్నారు. 2022 ఆగస్టు 11న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ఆయన పాత్రపై అధికార పక్షం నుంచి ప్రశంసలు, విపక్షాల నుంచి విమర్శలు రెండూ వ్యక్తమవుతున్నాయి. ఆయన వైఖరికి బాధ పడిన విపక్షాలు చరిత్రలో మొదటిసారి అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చింది. 

సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, రాజకీయాలలో ఉపరాష్ట్రపతి పదవికి చేరుకున్నారు. ఆయన జీవనయానం ప్రశంసనీయం. అయితే, రాజ్యసభ ఛైర్మన్‌గా వారి ప్రవర్తన, పనితీరు, ముఖ్యంగా పక్షపాత వైఖరి, విమర్శకుల పట్ల చూపిన ప్రవర్తన సుదీర్ఘ చర్చలకు దారితీస్తోంది.

రాజస్థాన్‌లోని కితానా గ్రామంలో 1951 మే 18న సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ధన్‌కర్ భౌతిక, న్యాయశాస్త్రాలలో విద్యాభ్యాసం తర్వాత న్యాయవాద వృత్తి చేపట్టి ప్రసిద్ధి చెందారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా పేరుగాంచారు. 1989లో జనతాదళ్ తరఫున జునును నియోజక వర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సేవలందించిన సమయంలో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తలెత్తిన ఘర్షణలు ఆయనపై ‘బీజేపీ పక్షపాతి’ అన్న ముద్ర వేశాయి. గవర్నర్‌గా రాజ్యాంగం ప్రకారం నిష్పాక్షికంగా నడచుకోలేదన్న విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు.

సమతుల్యత పాటించాలి

రాజ్యసభ ఛైర్మన్‌గా జగదీప్ ధన్‌కర్ తన పదవికి తగినట్లు అన్ని పార్టీలను కలుపుకొని పోతూ సమతుల్యతను ప్రదర్శించాల్సి ఉంది. కానీ, తన పక్షపాత ధోరణి, వివాదాస్పద, ఘర్షణకారక వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. రాజ్యసభలో ఆయన తీరు చిత్రవిచిత్రంగా ఉందనేది------- ప్రధాన విమర్శ. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష సభ్యులను మాటిమాటికి అడ్డుకోవడం, వారి అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, ప్రక్రియాపర నియమాలను ఉపయోగించి చర్చలను మధ్యలోనే నిలిపివేయడం వంటి ఆరోపణలు చాలా ఉన్నాయి.

ఇది రాజ్యసభ సమతుల్య స్వభావాన్ని దెబ్బతీస్తుందని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.------మహిళా సభ్యులనుకూడా ఆయన మాటలతో కించపరిచేవారు. సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచన్ సభలో ధనకర్ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. మహిళా పార్లమెంటు సభ్యులపట్ల చులకన భావాన్ని చూపుతూ కామెంట్ చేయటాన్ని అధికార పక్షం సహా ప్రతిపక్ష మహిళా నేతలూ తీవ్రంగా నొచ్చుకొని స్పందించారు. 

పెద్దల సభ గౌరవాన్ని నిలబెట్టాలి

చాలామంది ఆయన మాటలకు బాధపడ్డారు. పదవికి తగిన హుందాతనాన్ని నిలబెట్టుకోలేక పోతున్నారని అన్నారు. ఆయన మాటలు అవమానకరంగా ఉంటాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది పెద్దల సభ గౌరవాన్ని తగ్గించడమేకాక పార్లమెంటరీ వ్యవస్థకు తగదని వారు అంటున్నారు.. ధన్‌కర్ మానసికంగా అసహనంగా ఉంటారు. తరచూ ఆవేశపడి పోతూ ఉంటారు. ప్రతి విషయంలో ఆత్రుత కనిపిస్తుంది.

నలుగురి దృష్టిలో పడాలనే వాంఛ బలంగా కనిపిస్తుంది. --ఆయన వాదనలో తరచూ వివాదాస్పద ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ప్రతి విషయంలో తన వాదమే నెగ్గాలనే పంతం కనిపిస్తుంది. బహుశా న్యాయవాదిగా ఆయన నేపథ్యం ఈ స్వభావానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రాజ్యసభ నిర్వాహణలోనూ అదే వైఖరి కొనసాగుతున్నట్టు అంటున్నారు. రాజ్యసభ చైర్మన్‌గా ఉంటూ బీజేపీకి అత్యంత దగ్గరగా ఉండటం ప్రతిపక్షాలను ఆందోళనకు గురిచేస్తోంది. 

డా. కోలాహలం రామ్‌కిశోర్