calender_icon.png 6 November, 2024 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షోభ బంగ్లా!

06-08-2024 02:20:27 AM

ప్రధాని షేక్ హసీనా రాజీనామా

  1. మిలిటరీ చేతిలోకి పాలన 
  2. పార్లమెంట్ రద్దు 
  3. జైలు నుంచి మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు 
  4. అధ్యక్షుడు షహబుద్దీన్ ఆదేశం

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల పెంపుతో మొదలైన వివాదం ఆ దేశంలో అనిశ్చితికి కారణమైంది. నిరసనలు హింసాత్మకంగా మారి 300 మంది మరణానికి దారితీసింది. ఆదివారం ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో ఆర్మీ జోక్యం చేసుకుని ప్రధాని షేక్ హసీనాకు అల్టిమేటం జారీ చేసింది.

దీంతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు సైనిక హెలీక్యాప్టర్‌లో వచ్చారు. ముందు త్రిపుర రాజధాని అగర్తలకు చేరుకుని అనంతరం అక్కడి నుంచి యూపీలోని ఘజియాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయ్యారు.

లండన్‌లో ఆశ్రయం కల్పించేలా సాయంచేయాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఇక హసీనా దేశం విడిచిన తర్వాత పూర్తి అధికారాన్ని సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇది సైనిక తిరుగుబాటు కాదని, కేవలం జోక్యం మాత్రమేనని తెలిపింది. ప్రధాని హసీనా దేశం విడిచినట్లు తెలియడంతో లక్షలాది మంది నిరసనకారులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. 

  • సైనిక పాలనలోకి పొరుగుదేశం
  • దేశవ్యాప్తంగా జరిగిన హింసలో 300 మంది మృతి
  • భారత్‌కు పారిపోయి వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని
  • ఢిల్లీలో అజిత్ దోవల్‌తో భేటీ
  • లండన్‌లో ఆశ్రయానికి సాయం చేయాలని విజ్ఞప్తి
  • పార్లమెంట్‌ను రద్దు చేసిన బంగ్లా అధ్యక్షుడు షాహబుద్దీన్
  • మాజీ ప్రధాని ఖాలేదా జియా విడుదలకు సైతం ఆదేశం
  • తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఆర్మీ చీఫ్
  • ప్రధాని ప్యాలెస్‌లో నిరసనకారుల విధ్వంసం
  • తాజా పరిణామాలతో సరిహద్దుల్లో భారత్ అలర్ట్

న్యూఢిల్లీ, ఆగస్టు 5: రిజర్వేషన్ల అంశంతో చెలరేగిన ఉద్రిక్తతలతో మరోసారి బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొంది. ఆదివారం జరిగిన ఘర్షణల్లో 100 మందికిపైగా మృతి చెందగా ఇప్పటివరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

దీంతో ముందు జాగ్రత్త చర్యగా బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకా ప్యాలెస్‌ను వీడారు. దేశంలో పరిస్థితులు ఉధృతం కావడంతో పాటు, ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసి ఆమె సోదరితో పాటు దేశం విడిచి భారత్‌కు వచ్చారు. దీంతో 15 ఏళ్ల సుదీర్ఘ పాలనకు తెరదించినట్లు అయింది. 76 ఏళ్ల హసీనా బంగ్లాదేశ్‌కు ఐదు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు.

భద్రతా కారణాలు దృష్ట్యా హసీనా దేశం విడిచి వెళ్లారని ఆమె కుమా రుడు సాజిద్ వాజెద్ తెలిపారు. హసీనా తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేని తెలిపారు. ప్రధాని రాజీనామాతో పార్లమెం ట్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లా అధ్యక్షుడు షాహబుద్దీన్ ప్రకటించారు. అంతేకాకుండా హసీనా ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖాలే దా జియాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. 

భారత్‌కు హసీనా

మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌లో హసీనా, ఆమె సోదరి భారత్‌లోని త్రిపుర రాజధాని అగర్తలకు వెళ్లారు. అయితే, ఈ హెలికాప్టర్ భారత గగనతలంలోకి ప్రవేశించగానే ఇండియన్ ఫైటర్ జెట్లు కొద్దిసేపు వెంబడించాయి. తర్వాత అగర్తల నుంచి ఆమె ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరం లో ఉన్న యూపీలోని గాజియాబాద్‌కు వచ్చారు.

అక్కడి హిండన్ ఎయిర్‌బేస్‌లో దిగారు. అనంతరం ఢిల్లీకి వచ్చి భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌తో హసీనా భేటీ అయ్యారు. లండన్‌లో ఆశ్రయం కల్పించేందుకు సాయంచేయాలని కోరినట్లు తెలుస్తోంది. బంగ్లా పరిణామాలపై ప్రధాని మోదీకి విదేశాంగమంత్రి జైశంకర్ వివరించారు.  

సైన్యం అధీనంలోకి బంగ్లా

ప్రధాని హసీనా రాజీనామా, దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఇప్పటికే బంగ్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. దేశంలో పరిస్థితులు తీవ్రతరం అవుతుండటంతో ప్రధాని హసీనాకు ఆర్మీ అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమ యం ఇచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఆమె రాజీనామా చేసి భారత్ ఆశ్రయం పొందినట్లు చెబుతున్నారు. హసీనా దేశం విడిచిన తర్వాత పూర్తి అధికారాన్ని ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. నిరసనకారులను శాంతించాలని కోరారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశా రు.

రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఇది సైనిక తిరుగుబాటు కాదని కేవలం పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసుకున్న జోక్యం మాత్రమేనని తెలిపారు. ఆందోళనలతో దేశంలో చాలా మంది ప్రాణాలతో పాటు ఆర్థికంగా నష్టపోయిందని చెప్పారు.

ఇప్పటికైనా హింసను ఆపాలని, రాత్రి వరకు అల్లర్లను ఆపితే అత్యవసర స్థితి అవసరం ఉండదని ఆర్మీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో పరిస్థితులపై విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమయంలోనే హసీనా రాజీనామా విషయాన్ని ఆయన వెల్లడించారు. 

హిందూ ఆలయాల ధ్వంసం

ఆదివారం జరిగిన నిరసనల్లో ఇస్కాన్, కాళీ దేవాలయాలతో పాటు హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని తెలుస్తోంది. అల్లర్లలో రంగ్‌పూర్‌కు చెందిన హిందూ ప్రచారకుడు కాజల్‌రాయ్ మరణించారు. 

అసలు గొడవేంటి?

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్నినెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారా యి. 1971 స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడినవారి కుటుంబాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం వివాస్పదమైంది. ఇది ఉద్యమంలో పాల్గొన్న అధికార అవామీ లీగ్ మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో రిజర్వేషన్ల రద్దుకు విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ, ఆందోళనకారుల మధ్య ఘర్షణల్లో మొత్తం 300 మంది మరణించగా, వేలాదిమంది గాయపడ్డారు. ఈ పరిస్థితుల నడుమ బంగ్లా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లను 30 నుంచి 5 శాతానికి కుదించాలని తీర్పునిచ్చింది. ఇందుకు ప్రభుత్వం సైతం అంగీకరి ంచింది. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ప్రధాని రాజీనామా చేయాలనే డిమాం డ్‌తో మళ్లీ నిరసనలు ప్రారంభమయ్యాయి. 

ప్రధాని నివాసంలో లూటీ

హసీనా రాజీనామా చేసిన తర్వాత దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరసనకారులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు, జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఢాకాలో మరికొంత మంది నిరసనకారులు ప్రధాని అధికార నివాసమైన గణభాబన్‌ను ముట్టడించారు. ఫర్నిచర్‌ను విరగ్గొట్టి భవనంలో విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువులను లూటీ చేశారు.

చికెన్, ఫిష్, కూరగాయలు, దుప్పట్లు, ఫర్నిచర్‌తోపాటు ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. హసీనా బెడ్‌పైనా పడుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెలిపింది. ఢాకాలోని యుద్ధ ట్యాంక్‌పైకి ఎక్కి డ్యాన్స్‌లు కూడా చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా నగరంలోని బంగబంధు మెమోరియల్ మ్యూజియానికి నిప్పు అంటించారు. 

మీదే బాధ్యత 

బంగ్లాలో ఉద్రిక్తల నడుమ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీద్ వాజెద్‌జాయ్ ఫేస్‌బుక్‌లో సైన్యానికి పలు విజ్ఞప్తులు చేస్తూ ఓ పోస్ట్ చేశారు. “ప్రజలను, దేశాన్ని సురక్షితంగా ఉంచడం మీ బాధ్యత. ఎన్నిక కాకుండా అధికారం దక్కించకునే హక్కు ఎవరికీ లేదు. అలాంటి వారిని ఒక్క నిమిషం కూడా అనుమతించవద్దు.

ప్రధానిని గద్దె దించితే మనం సాధించిన అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మళ్లీ పుంజుకునేందుకు చాలా సమయం పడుతుంది. అలాంటి స్థితికి ఎవరూ కోరుకోరు” అని సాజీద్ పేర్కొన్నారు. హసీనాకు సాజీద్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సలహాదారుగా పనిచేస్తున్నారు.  

భారత్ అలర్ట్

బంగ్లా పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఢిల్లీ చాణక్యపురిలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అలాగే బంగ్లాదేశ్‌లోని భారత దౌత్య కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ఢాకాకు ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు చేసింది. టికెట్లు కొన్న ప్రయాణికులకు సహకరిస్తామని, తమ కు భద్రతే అత్యంత కీలకమని ప్రకటించింది. కోల్‌కతా మైత్రీ ఎక్స్‌ప్రెస్ ను కూడా రైల్వే అధికారులు రద్దు చేశారు. సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తమైంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) హైఅలర్ట్ ప్రకటించింది.

బీఎస్‌ఎఫ్ డీజీ దల్జీత్‌సింగ్ చౌదరి కోల్‌కతా చేరుకున్నారు. భారత్ మధ్య ఉన్న 4,096 కి.మీ మేర సరిహద్దులో అదనపు బలగాలను మోహరించాలని, కమాండర్లందరూ బార్డర్‌లోనే ఉండాలని సీనియర్ అధికారులు ఆదేశించారు. బీఎస్‌ఎఫ్ సిబ్బందికి సెలవులను సైతం రద్దు చేశారు. బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో బెంగాల్‌లో శాంతి భద్రతలు కాపాడాలని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే చర్యలకు దిగకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

ఆర్మీ గొడుగు కింద..

1971లో బంగ్లాదేశ్ అవామీ లీగ్ పోరాటంతో స్వాతంత్య్రం పొందింది. స్వతంత్ర బంగ్లాదేశ్‌కు బంగబంధు ముజీబుర్ రెహమాన్ మొదటి అధ్యక్షుడ య్యారు. మూడేళ్ల పాటు తనదైన పాలనతో అత్యంత ప్రజాదరణ పొందారు. 

* 1975 చివరి రోజుల్లో ముజీబుర్‌కు ప్రజావ్యతిరేకత ప్రారంభమైంది. ఆయనకు బంధుప్రీతి ఉందని, మేనల్లుళ్లు అనధికారిక ప్రభుత్వ ప్రతినిధుల అవతారం ఎత్తారనే ఆరోపణలు వెల్లువె త్తాయి. అంతేకాకుండా ఆయన కుటుంబంపై అవినీతి మరకలూ లేకపోలేదు.

* మాజీ సైనికాధికారి మాజిద్ సైన్యం సహకారంతో 1975 ఆగస్టు 15న ముజీబుర్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్లను దారుణంగా హతమార్చాడు.   

* ముజీబుర్ హత్య ఉదంతం, అల్లర్ల తర్వాత 1975 ఆగస్టు 6న నాటి వాణిజ్యశాఖ మంత్రి ఖోండాకర్ మోస్తాక్ పాలన పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. తనకు తాను ప్రభుత్వాధినేతగా ప్రకటించుకున్నాడు. తిరుగుబాట్లు, హింసాత్మక ఘటనలతో ఆయన ఇదే ఏడాది నవంబర్ 6 వరకే దేశాన్ని పాలించగలిగాడు.

* 1975 నవంబర్ 3 నుంచి 7వ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నాటి ఆర్మీ జనరల్ జియావుర్ రెహమాన్ తిరుగుబాట్లను అణచివేసి తిరిగి సైనిక పాలన ప్రారంభించారు.

* ఆర్మీ జనరల్  జియావుర్ రెహమాన్ నియంతృత్వ పాలన సాగించాడు. తనకు ఎదురుతిరిగిన 2,500 మంది ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సైనికులను ఉరి తీయించాడు. ఆయన నియంతృత్వ పోకడలతో దేశవ్యాప్తంగా తిరుగుబాట్లు మొదలయ్యాయి. 1975 నుంచి 1981 వరకు జియావుర్ రెహమాన్‌పై 21 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. దీన్నిబట్టి ఆయన పాలనపై ఎంత ప్రజా వ్యతిరేకత ఉందనేది అర్థం చేసుకోవచ్చు. 

* 1977లో ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ బంగ్లాదేశ్‌లో జియావుర్ రెహమాన్‌ను పడగొట్టి మార్క్సిస్ట్ పాలన సాగించేందుకు విఫలయత్నం చేశాడు.

* 1977 అక్టోబర్2న బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ జియావుర్ రెహమాన్ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ తిరుగుబాటుకు ‘ఎర్ర విప్లవం’ అని నామకరణం చేశారు. వారి తిరుగుబాటుకు సొవియట్ రష్యా కూడా పరోక్షంగా సహాయ సహకారాలు అందించింది. అయినప్పటికీ జియావుర్ తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపాడు. ఉద్యమంలో భాగస్వాములైన 1,143 మంది సైనికులను ఉరితీయించాడు. వేలాది మందిని జైళ్లలో నిర్బంధించాడు. 

* 1981లో సైనికుల చేతిలోనే చిట్టగాంగ్‌లో జియావుర్ రెహమాన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత 1982లో ఆర్మీ జనరల్ హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్ పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి సైనిక పాలన ప్రారంభించాడు.

* 2007లో మరోసారి సైనిక తిరుగుబాటు మొదలైంది. రెండేళ్ల పాటు బంగ్లాదేశ్ సైనిక పాలనలోనే ఉంది. 2009లో సైన్యంలో అంతర్గత పోరు మొదలైంది. ఒక వర్గం హుస్సేన్ మహమ్మద్ ఎర్షాద్‌కు మద్దతు ఇవ్వగా, మరోవర్గం ఆయన పాలనను వ్యతిరేకించింది. వ్యతిరేకించిన వర్గంలో 56 మంది సైనికాధికారులను ఎర్షాద్ హతమార్చాడు. 

* 1971 నుంచి బంగ్లాదేశ్ ఇప్పటివరకు 28 సార్లు సైనిక తిరుగుబాట్లను చవిచూసింది. తిరుగుబాటు వచ్చిన ప్రతిసారి దేశం అల్లకల్లోలమైంది. అస్థిరత వచ్చి దేశ ఆర్థిక రంగం కుదేలైంది. ప్రతిసారి ప్రజాస్వామ్య పాలనకు విఘాతం కలిగింది.