12-03-2025 01:03:51 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలకు.. అలాగే నిర్వహణ లోపాలకు బాధ్యులు గా మొత్తం 42 మంది ఇంజినీరింగ్ అధికారులను గుర్తించినట్టు, వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని విజిలెన్స్ విభాగం సిఫారసు చేసినట్టు తెలు స్తుంది.
ఈ 42 మంది అధికారుల్లో నీటిపారుదల శాఖలోని ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) నుంచి మొదలుకుని క్షేత్రస్థాయిలో కాళేశ్వరం నిర్మాణాన్ని ప్రత్యక్షంగా చూసి, పర్యవేక్షించి, నిర్మాణ పనుల్లో భాగస్వాములైన జేఈ (జూనియర్ ఇంజినీర్) వరకు ఉన్నట్టుగా విశ్వసనీయంగా అందిన సమాచారం. అలాగే నీటిపారుదల శాఖలోని ఇంజనీరింగు అధికారులతోపాటు..
కాళేశ్వరం నిర్మాణ వ్యవహారాలు, ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించి నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖలో పనిచేసిన పలువురు ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల పాత్రను కూడా ఈ నివేదికలో నిర్ధారించి వారిపైకూడా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ.. విజిలెన్స్ విభాగం సిద్ధంచేసిన నివేదికను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌కు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టు తెలుస్తుంది.
2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యాలయం నుంచి మొదలుకుని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని, అక్కడి కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది, అలాగే నిర్మాణ పనులు చేసిన సంస్థల కార్యాలయాలు, అధికారులను అప్పటి విజిలెన్స్ విభాగం డీజీ రాజీవ్త్రన్ నేతృత్వంలో బృందం సునిశితంగా విచారించింది.
ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల్లోని కీలకమైన పత్రాలు, రికార్డులు, దస్త్రాలనుకూడా విజిలెన్స్ బృందం స్వాధీనం చేసుకుంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై న్యాయ విచారణకు నిర్ణయం తీసుకుని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డీజీ రాజీవ్త్రన్ అకస్మాత్తుగా మరణించడంతో విచారణ దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పవచ్చు.
పైగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించడంతో విజిలెన్స్ విచారణ, నివేదికపై ఆసక్తి తగ్గింది. ఒకేసారి సమాంతరంగా అటు న్యాయ విచారణ, ఇటు విజిలెన్స్ విచారణ సరికాదనే ఆలోచనతో విజిలెన్స్ విచారణ పూర్తిగా మందగించింది.
ఎట్టకేలకు నివేదిక..
విజిలెన్స్ డీజీ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్త్రన్ హఠాన్మరణం తరువాత కొంత కాలంగా కాళేశ్వరంపై విచారణలో స్తబ్దత ఏర్పడినప్పటికీ.. విజిలెన్స్ విచారణ నివేదిక తనకు అందించాలని పలుమార్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి, నీటిపారుదల శాఖకు, విజిలెన్స్ డీజీకికూడా లేఖలు రాశారు.
ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రస్తుత డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరంపై శాఖాపరంగా చేసిన విచారణలో వెల్లడైన అంశాలు, అధికారులు, సిబ్బంది రాబట్టిన సమాచారాన్ని, అలాగే రికార్డులు, ఫైళ్లను పరిశీలించిన పిదప అనుబంధ పత్రాలతో కలిసి సుమారు 2500 పైగా పేజీలతో నివేదికను సిద్ధంచేసి విజిలెన్స్ కమిషన్‌తోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈనెల మొదటి వారంలో అందించినట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం.
కింది నుంచి పై వరకు..
ఈ నివేదికలో పొందుపర్చిన సిఫారసుల్లో.. చాలా కీలకమైనవి ఉన్నట్టుగా తెలు స్తుంది. సుమారు 42 మంది ఇంజనీరింగు (నీటి పారుదల శాఖ) అధికారులతోపాటు.. పలువురు ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల ప్రమేయాన్నికూడా ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇంజనీరింగు విభాగంలోని అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిన విజిలెన్స్ శాఖ..
ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులపైకూడా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్టుగా తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవినీతి, అక్రమాలు, అవకతవకల్లో భాగస్వాములైన కింది నుంచి పైస్థాయి వరకు అధికారులందరి పాత్రను విజిలెన్స్ శాఖ ఈ నివేదికలో వెల్లడించినట్టుగా సమాచారం.
సర్వే నుంచే..
విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన సర్వే నుంచి మొదలుకుని, 2023 నవంబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వరకు అన్ని కోణాల్లోనూ సేకరించిన సమాచారాన్ని ఇందులో పొందుపర్చినట్టు తెలుస్తుంది. విజిలెన్స్ విచారణ సందర్భంగా సర్వేకూడా తప్పుల తడకగా కొనసాగిన వైనాన్నికూడా ఇందులో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలుస్తుంది.
ఈ సర్వేలోనూ పాల్గొన్న అధికారులు, సిబ్బంది పాత్రనుకూడా ఈ నివేదికలో పొందుపర్చినట్టు, బాధ్యులుగా గుర్తించి వారిపై చర్యలకుకూడా సిఫారసు చేసినట్టు సమాచారం. అలాగే మేడిగడ్డ బ్యారేజీతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది, కార్యాలయం నుంచి, అలాగే నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన సమాచారం, దస్త్రాలు, రికార్డుల పరిశీలనలో వెల్లడైన అవకతవకలనుకూడా ఈ నివేదికలో పొందుపర్చినట్టు తెలుస్తుంది.
ఈ సందర్భంగా అవకతవకలకు బాధ్యులనుకూడా గుర్తించి వారిపై చర్యలకు సిఫారసు చేసినట్టుగా సమాచారం. దీనితోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్వహణలో లోటుపాట్లు, అధికారులు, సిబ్బంది పాత్రలనుకూడా ఈ నివేదికలో పొందుపర్చి, బాధ్యులపై చర్యలకు సిఫారసు చేసినట్టు తెలుస్తుంది.
త్వరలో జస్టిస్ ఘోష్ కమిషన్ చేతికి..
ఇదిలా ఉండగా.. కాళేశ్వరం అవినీతిపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చాలా వేగంగా నడుస్తోంది. ఇప్పటికే ఈఎన్‌సీ నుంచి మొ దలుకుని ఐఏఎస్‌ల వరకు అధికారు లు, ఇంజనీర్లను కమిషన్ విచారించింది. ఈ నేపథ్యంలోనే తమకన్నా ముందుగా విచారణ చేసిన విజిలెన్స్ నివేదికను పంపించాలని పలుమార్లు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రా సింది.
ఈ విజిలెన్స్ నివేదికలో పొందుపర్చిన అంశాలను ఆధారంగా చేసుకు ని, మరింత కట్టుదిట్టంగా న్యాయ విచారణను ముగించి, బాధ్యులను తేల్చాల నే ఆలోచనతో కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తాజాగా విజిలెన్స్ విచారణ అటు విజిలెన్స్ కమిషన్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరిన నేపథ్యంలో..
త్వరలోనే ప్రభుత్వం నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కుకూడా ఈ నివేదిక అందే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ నివేదిక రావడంతోనే.. మరింత వేగంగా కమిషన్ కాళేశ్వరంపై విచారణను ముగించే అవకాశం ఉంది.