calender_icon.png 28 October, 2024 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిమినల్ కేసులే

30-08-2024 01:40:31 AM

చెరువులలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కొరడా

ఆరుగురిపై కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ సీపీకి లేఖ రాసిన హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా అక్రమ నిర్మాణాలు కూల్చివేయడమే కాకుండా, ఆ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైనా క్రిమి నల్ చర్యలకు హైడా శ్రీకారం చుట్టింది. చెరువులలో ఆక్రమణలకు పాల్పడిన వారితోపాటు, ఆ అక్రమాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఏవీ రంగనాథ్ గతంలోనే హెచ్చ రించారు.

అయితే, ఈ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాకుండా, అలాంటి అధికారులపై ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు హైడ్రా సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతికి లేఖ రాయడం సంచలనంగా మారింది.

జీహెచ్‌ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్, హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్‌తోపాటు నిజాంపేట తహసీల్దార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏవీ రంగనాథ్ ఆ లేఖలో కోరారు. ఇదిలా ఉండగా, గండిపేటకు సంబంధించిన వ్యవహారంలో సూపరింటెండెంట్‌పై కూడా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. 

హైడ్రా పేరుతో వసూళ్లు!

కఠిన చర్యలు తప్పవన్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టంగా హెచ్చరించారు. చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్న నేపథ్యంలో హైడ్రా అంటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన నోటీసులు.. రెండు, మూడేండ్ల క్రితం నాటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని సీఎం తెలిపారు. ఇలా హైడ్రా పేరుచెప్పి భయపెట్టి, బెదిరించి అవినీతికి పాల్పడే కిందిస్థాయి అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఎం హెచ్చరించారు.  దీనితోపాటు.. ఇలాంటి అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నవారిపై దృష్టి కేంద్రీకరించాలని, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.