calender_icon.png 24 October, 2024 | 4:05 AM

మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

24-10-2024 02:00:50 AM

  1. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
  2. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో కేటీఆర్‌తో పాటు సాక్షి దాసోజు శ్రవణ్ స్టేట్‌మెంట్ రికార్డు 
  3. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వడానికి కేటీఆర్ బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

దాదాపు 20 నిమిషాల పాటు న్యాయస్థానం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. మంత్రి సురేఖ తన పరువు, ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మాట్లాడిందని కేటీఆర్ కోర్టుకు తెలిపారు. బాధ్యతాయుత పదవిలో ఉండి తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

గత 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నానని, ఆమె తన మాటలతో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.  నేను డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని నాతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం చేయాలనేదే ఆమె ఉద్దేశం అని కేటీఆర్ అన్నారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు కేటీఆర్ తెలిపారు. యూట్యూబ్ లింక్స్‌తో పాటు పేపర్ స్టేట్‌మెంట్స్ సైతం కోర్టుకు ఇచ్చానని చెప్పారు. 

కేటీఆర్ వాంగ్మూలం ఆధారంగా..

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కోర్టు.. మంత్రి కొండా సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని కేటీఆర్‌ను ప్రశ్నించింది. దీంతో ఫిర్యాదు కాపీలో వివరాలన్ని సమగ్రంగా ఉన్నాయని కోర్టుకు కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు. వాటినే ప్రామాణికంగా తీసుకోవాలా? లేకుంటే స్టేట్‌మెంట్ ఇస్తారా? అని కోర్టు మళ్లీ ప్రశ్నించింది.

ఆ వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయని, వాటిని తిరిగి తన నోటితో చెప్పడం ఇష్టం లేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. కేటీఆర్‌తో పాటు దాసోజు శ్రవణ్ వాంగ్మూలాలు నమోదు చేసిన నాంపల్లి కోర్టు.. మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను ఈ నెల 30న నమోదు చేయనుంది.