రాష్ట్ర వార్షిక నివేదిక విడుదల
తెలంగాణలో కేసులు పెరిగాయి..
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ జితేందర్(Telangana DGP Jitender) 2024 నేర వార్షిక నివేదికను ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. ఈ ఏడాది కేసులు 2 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీసుశాఖ లక్ష్యమని సూచించారు. 1800 వెబ్ సైట్ యూఆర్ఎల్ లను బ్లాక్ చేశామని చెప్పారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చామన్నారు. డిజిటల్ ఎఫ్ఐఆర్(Digital FIR) నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రాష్ట్రంలో 33,618 సైబర్ క్రైమ్ కేసులు, 1,525 కిడ్నాప్ కేసులు, 703 చోరీ కేసులు, 2,945 అత్యాచార కేసులు, 58 దోపిడీ కేసులు, 1,948 ఇంట్లోకి చొరబడి చోరీలకు పాల్పడిన కేసులు, 856 హత్య కేసులు నమోదు చేశామని వివరించారు. డయల్ 100కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులు నమోదయ్యాయన్నారు. సైబరాబాద్ లో 15,360, హైదరాబాద్ లో 10,501, రాచకొండలో 10,251 నమోదు చేశామని పేర్కొన్నారు. మైనర్ ఘటనలు మినహా శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు.
సైబర్ క్రైమ్ కేసులో రూ. 180 కోట్లు బాధితులకు అప్పగించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 142.95 కోట్ల డ్రగ్స్ సీజ్ చేశామన్నారు. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. 48 డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. రాష్ట్రంలో 85 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, మరో 41 మంది మావోయిస్టులు(Maoists) లొంగిపోయారని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టులకు సంబంధించిన పెద్దగా కార్యకలాపాలు లేవని డీజీపీ అన్నారు. ఒక సంఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ముద్రవేసి చంపారు. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని తెలిపారు. జైనూర్, వికారాబాద్‌తో పాటు మరికొన్ని చోట్ల ఘర్షణలు(Telangana Crime Rate 2024) తప్ప రాష్ట్రంలో పెద్దగా మతపరమైన హింస జరగలేదని డీజీపీ వెల్లడించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొత్త రిక్రూట్‌మెంట్‌లు జరిగాయని, కొత్త రిక్రూట్‌మెంట్లు లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్‌లో ప్రొఫెషనల్ పద్ధతిలో శిక్షణనిచ్చాయని డీజీపీ జితేందర్ చెప్పారు.
తెలంగాణలో సెల్ ఫోన్స్ చోరీ కేసులో 8,231 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం, గత ఏడాదిలో పోలిస్తే ఈ ఏడాది శిక్ష ఖరారు శాతం తగ్గిందన్నారు. గత ఏడాది 39,371, ఈ ఏడాది 28,477 మంది మాత్రమే శిక్ష ఖరారైందన్నారు. ఈ ఏడాది ముగ్గురికి మరణ శిక్ష విధించారని డీజీపీ తెలిపారు. హైదరాబాద్(Hyderabad) ఇద్దరు, సంగారెడ్డి ఒక కేసులో మరణ శిక్ష పడిందన్నారు. ఈ ఏడాది రౌడీ షీటర్లకు 18 కేసుల్లో 35 మందికి జీవిత ఖైదీ విధించారన్నారు. ఈ ఏడాది 116 కేసుల్లో జీవిత ఖైదీ పడిందన్నారు. అత్యాచారం కేసులో ఈ ఏడాది 3 కేసుల్లో నలుగురికి, మహిళలపై దాడుల్లో 51 కేసుల్లో 70 మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు. పొక్సో 77 కేసులు నమోదు, 82 మందికి శిక్ష ఖరారైందన్నారు. ఫింగర్ ప్రింట్స్ టీమ్ 507 కేసులు చేధించిందని తెలిపారు.
71 గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించామని తెలిపారు. షీ టీమ్స్(SHE Teams) కు సంబంధించిన వేధింపుల ఫిర్యాదుల్లో 830 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశాం.. 15,664 ఫిర్యాదుల్లో షీటీమ్స్ కౌన్సిలింగ్ చేసిందని డీజీపీ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 భరోసా సెంటర్లు ఏర్పాటు చేశామన్న తెలంగాణ డీజీపీ గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది 11,64,645 సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 99.16 కోట్లు, రూ. 11.55 కోట్ల మద్యాన్ని, రూ. 63.22 కోట్ల అభరణాలు, రూ. 14,66 కోట్లు మాదకద్రవ్యాలు సీజ్ చేశామన్నారు. 2024 ఎన్నికల్లో రూ. 200.69 కోట్లు విలువైన వస్తులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పోలీసు శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్న డీజీపీ వ్యక్తిగతం, కుటుంబసమస్యలతో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. చాలా సందర్భాల్లో వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య జరుగుతున్నాయని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన కేసు(Sandhya Theater incident case)లో దర్యాప్తు సాగుతోందని ఆయన వెల్లడించారు.