24-03-2025 06:16:39 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు నడుస్తున్నందున వీటిపై ఎవరు బెట్టింగ్స్(Cricket Betting) కాయరాదని, అలా కాస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) హెచ్చరించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చాలా మంది యువకులు మ్యాచ్ గెలుపు ఓటముల విషయములో పెద్ద మొత్తములో బెట్టింగ్ చేసే అవకాశం ఉందన్నారు. ఇలా చేయడం వలన కోలుకోలేని విధంగా ఆర్థిక నష్టం జరిగి చివరికి ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. తల్లితండ్రులు పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు ఉన్నాయేమో గమనించి వారితో తరచూ మాట్లాడాలని సూచించారు. లేదంటే డబ్బులు, ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు.
మీ కష్టార్జితాన్ని, కన్న బిడ్డలను బెట్టింగ్ విషయంలో కోల్పోవద్దని సూచించారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్(Online Betting), ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ... సైబర్ మోసగాళ్ళ(Cyber Fraudsters) చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ వీటి బారిన పడకుండా అప్రమత్తముగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరం అని, ఎవరైనా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్(IPL Cricket Match) ల బెట్టింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా క్రికెట్ మ్యాచ్ ల బెట్టింగ్ కు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.