కాంగ్రెస్ మద్దతు కోసం ఆశావహుల ప్రయత్నాలు
బరిలో నిలిచేందుకు యువత ఉత్సాహం
వనపర్తి, నవంబర్ 9 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పోటీలో ఉండాలనుకునే వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పంచాయతీ ఎన్నికల బరిలోకి ది గేందుకు యువత ఉత్సాహం చూపుతున్నది. సర్పంచ్‌గా పోటీలో నిలిచేందుకు ఆశావహులు కాంగ్రెస్ మద్దతు కోసం ప్రయ త్నాలు చేస్తున్నారు. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేసకుంటున్నారు. కొంద రు ఆశావహులు బరిలో ఉంటామనే సంకేతాలను ఇస్తూ గణపతి, అమ్మవారి ఉత్సవాల్లో తాయిలాలు అందించారు. గ్రామాల్లోని ఆయా సంఘాల వారితో మంతనాలు జరుపుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు. కుల సంఘాల అధ్యక్షులతో మంతనాలు జరుపుతూ ఓట్లపై ఒప్పందాలను కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు.
సోషల్ మీడియా వేదికగా..
వనపర్తి జిల్లాలో సోషల్ మీడియా వేదికగా స్థానిక సంస్థల ఎన్నికలపై పొలిటికల్ వార్ నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ జెండా ఎగురవేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని ప్రజలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని ఆ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.