లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని కలిసికట్టుగా ఢీకొట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఏర్పడిన ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నం కాబోతోందా? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు 2023లో 26 ప్రధాన ప్రతిపక్షాల కలయికతో ‘ఇండియా’ అలయెన్స్ ఏర్పాటయింది.
అప్పుడు జేడీ(యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్ చొరవతో కాంగ్రెస్ సహా 16 ప్రధాన ప్రతిపక్షాలు పాట్నాలో తొలిసారి సమావేశమై ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. తర్వాత మరో 10 పార్టీలు కూడా కూటమిలో చేరడానికి సిద్ధమయ్యాయి.
తర్వాత ముంబయిలో జరిగిన సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చించడానికి ఓ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ అన్ని సమావేశాల్లో కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించాలనే విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఈ పరిణామాలన్నీ గమనించిన వారంతా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఢీకొట్టడానికి ఓ బలమైన ప్రత్యామ్నాయం ఇన్నాళ్లకు ఏర్పడిందనే భావన కలిగింది. అయితే అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. నితీశ్ అనూహ్యంగా ఇండి యా కూటమికి గుడ్‌బై చెప్పి మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరిపోయి బీజే పీ మద్దతుతో బీహార్ సీఎం పగ్గాలు చేపట్టడంతో కూటమికి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
దీనినుంచి తేరుకున్న కూటమి లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో వీలయినంత మేర ఉమ్మడిగా పోటీచేయాలనుకున్నాయి. అయితే బెంగాల్‌లో ఎలాంటి సీట్ల సర్దుబాటుకు అంగీకరించబోమని, అన్ని సీట్లకు తామే పోటీ చేస్తామంటూ టీఎం సీ అధినేత్రి మమతా బెనర్జీ మరోబాంబు పేల్చారు. యూపీలోనూ కాంగ్రె స్ పార్టీకి మూడు స్థానాలే ఇచ్చేందుకు అఖిలేశ్ యాదవ్ సిద్ధపడ్డం, పంజాబ్‌లో ఒంటరి పోరుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ సిద్ధపడ్డం.. ఇలా వరస పరిణామాలతో ఎన్నికలకు ముందే కూటమి విచ్ఛిన్నం తప్పదని అనిపించింది.
అయితే అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి బీజేపీని ఒకింత అడ్డుకోగలిగింది. కానీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయాయి. కాంగ్రెస్ పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకోవడం, యూపీలో కాషాయ పార్టీ హవాకు అఖిలేష్ అడ్డుకట్ట, బెంగాల్‌లో దీదీ ప్రభంజనం, తమిళనాడులో డీఎంకే స్వీప్ ఇవన్నీ ప్రతిపక్షాలకు మంచికాలం ముందుందని భావించేలా చేశాయి.
అయితే షరా మామూలేనన్నట్లుగా ఎన్నో ఆశలు పెట్టుకున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాలు మరోసారి కూటమిలో విభేదాలు బట్టబయలయ్యేలా చేశాయి. కాంగ్రెస్ పనితీరుపై ఒక్కో పార్టీ అసమ్మతిగళం విప్పసాగాయి. ఇండియా కూటమి నేతృత్వాన్ని మమతాబెనర్జీ చేపట్టాలనే వాదన మొదలైంది.
ఎస్పీ, టీఎంసీ, ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్‌పవార్ ఎన్సీపీ, ఆప్, ఆర్జేడీ.. ఇలా ప్రతి పార్టీ కాంగ్రెస్, రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటులో అదానీ వ్యవహారంపై జరుగుతున్న ప్రతిపక్షాల నిరసనకు టీఎంసీ, ఎస్పీ దూరంగా ఉండడం ఇందుకు నిదర్శనం. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఇంతకాలం పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంత సులభంగా దాన్ని వదులుకుంటుందా? అనేదే ప్రశ్న. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగానే ఉన్నప్పటికీ జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు ఒక ఇమేజ్ ఉంది. అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలోను ఎంతో కొంత బలం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే తాజాగా రాజ్యసభ చైర్మన్ ధన్‌కర్‌పై అవిశ్వాసతీర్మానానికి అన్నిప్రతిపక్షాలు మద్దతు ప్రకటించడం గమనార్హం. ఈ అసమ్మతి ఎంతదాకా వెళ్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.