అనుమతి లేని మెడిసిన్‌ను విక్రయిస్తుండగా స్వాధీనం చేసుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు
డ్రగ్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ప్రజలకు నకిలీ మెడిసిన్ విక్రయిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమలాసన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆయుర్వేద, సిద్ద ఔషధాల పేరుతో కొందరు ఇష్టారీతిన రోగులకు మెడిసిన్, ఔషధాలు ఇస్తున్నారని, ఇప్పటికే కొందరు నకిలీ వైద్యనిపుణులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహించడం నేరమని, అలాంటి వారిని విడిచిపెట్టేదిలేదని స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమంగా మెడిసిన్ విక్రయిస్తున్నా, నకిలీ మెడిసిన్ అంటగడుతున్నా ప్రజలు వెంటనే టోల్-ఫ్రీ నంబర్ 1800 -599 -6969కు కాల్ చేయాలని పిలుపునిచ్చారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాడులు..
డ్రగ్ కంట్రోల్ అధికారులు బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలో ఎర్రపహాడ్‌లోని ఓ అనధికార మెడికల్ షాపులో దాడులు చేశారు. రూ.22 వేల విలువైన 30 రకాల మెడిసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని జలగం వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. యాదాద్రి -భువనగిరి జిల్లా భూదాన్ పొచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై దాడి చేశారు. రూ.38,382 విలువైన మెడిసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లాలో న్యూట్రా స్యూటికల్స్ పేరిట లైసెన్స్ లేకుండా ఫెరోమెన్ ఎక్స్ టీ టాబ్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలో నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు సోఫ్రాబాక్ట్ క్రీమ్ విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయించారు. నిజామాబాద్, హైదరాబాద్ నగరాల్లో ఆయుర్వేద, సిద్ధ మందులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.