calender_icon.png 3 April, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వైద్యులపై కొరడా

31-03-2025 12:33:28 AM

జిల్లాలో తనిఖీలు ముమ్మరం 

బెడ్లు వేసి వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలు 

నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహణ 

తనిఖీలలో బయటపడుతున్న బాగోతాలు 

మేడ్చల్, మార్చి 30 (విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో వైద్యాధికారులు నకిలీ వైద్యులపై కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లా వైద్యాధికారిణిగా డాక్టర్ సి ఉమా గౌరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీలలో విస్తుగొలిపే బాగోతాలు బయటపడుతున్నాయి. కొంతమందికి ఎలాంటి అర్హత లేకున్నా డాక్టర్లుగా చలామణి అవుతూ వైద్యం చేస్తున్నారు. మరికొన్నిచోట్ల ఆర్‌ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేస్తూ, నర్సింగ్ హోమ్ తరహాలో బెడ్లు వేసి ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. అబార్షన్లు చేసిన ఉదంతాలు కూడా బయటపడ్డాయి. 

అర్హతకు మించి వైద్యం 

నిబంధనల ప్రకారం ఆర్‌ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. ఇంజక్షన్లు కూడా ఇవ్వరాదు. కానీ అర్హతకు మించి చికిత్సలు చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్, యాంటీబయటిక్ ఇస్తున్నారు. గర్భిణులకు, చిన్నపిల్లలకు వైద్యం చేయరాదు. కానీ వీరికి కూడా వైద్యం చేస్తున్నారు. 

బయటపడిన నకిలీల బాగోతాలు 

బాచుపల్లి లో సహజ పాలి క్లినిక్, బుచ్చిబాబు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో నకిలీ జనరల్ ఫిజీషియన్ బాగోతం బయటపడింది. ఇక్కడ యాంటీబయాటిక్స్ రాయడం, ఇంజక్షన్లు ఇవ్వడం గుర్తించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ఉల్లంఘించినందున క్లినిక్ ను సీజ్ చేశారు. మల్కాజిగిరిలో మనోహర్ రెడ్డి పాలి క్లినిక్ లో అల్ట్రాసౌండ్ యంత్రాన్ని సీజ్ చేశారు. రిజిస్టర్ నిర్వహించకపోవడం, ఆన్లైన్లో ఎంట్రీ చేయకపోవడం, సీఈఏ చట్టాన్ని ఉల్లంఘించడంతో సీజ్ చేశారు. జగద్గిరిగుట్టలో శివనాగుల శ్రీనివాస్ నిర్వహిస్తున్న హాసిని క్లినిక్ తనిఖీ చేయగా, ఫార్మ్ డి అర్హత ఉన్న ప్రతీక్ అనే వ్యక్తి జనరల్ ఫిజీషియన్ గా అవతారం ఎత్తి చికిత్స చేస్తున్నట్టు గుర్తించారు. అంతేగాక మూడు పడకలు వేసి పత్రి నిర్వహిస్తున్నారు. క్లినిక్ ను సీజ్ చేసి నిర్వాహకులకు నోటీసు జారీ చేశారు.

మల్కాజిగిరిలో అను కృష్ణ ఆసుపత్రిలో స్కానింగ్ మిషను సీజ్ చేశారు. డి ఎం ఆస్పత్రిలో తనిఖీ చేసి నోటీసు జారీ చేశారు. బొల్లారంలోని రిసాల బజార్లో భవానీ క్లినిక్ లో నకిలీ వైద్యుడిని గుర్తించి క్లినిక్ ను సీజ్ చేశారు. వాయుపురిలో ప్యూర్ ఆర్థో ఆసుపత్రి, శ్రీరక్ష ఆసుపత్రులలో తనిఖీ చేసి నిర్వహణ లోపాలు గుర్తించారు. ఇవే కాకుండా పెద్ద ఆసుపత్రులలో కూడా పిసిపి ఎన్డిపి సదుపాయాలపై తనిఖీలు నిర్వహించారు.