calender_icon.png 4 January, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ఔషధాలపె ఉక్కుపాదం

02-01-2025 12:09:46 AM

  1. తయారీ, విక్రయాలను ఉపేక్షించం
  2. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీ, విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు.

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక నివేదికను బుధవారం మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో డైరక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. రాష్ర్టంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ను అత్యంత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

రాష్ర్టంలో నిషేధిత, నకిలీ మందులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తెలంగాణకు సరఫరా చేస్తూ డ్రగ్స్ రాకెట్‌కు పాల్పడుతున్న అక్రమార్కులపై ఎంతో సమర్థవంతంగా, కఠినంగా వ్యవహరించి 2024లో 573 కేసులను నమోదు చేసినట్టు వెల్లడించారు.

అదే సందర్భంలో 2023లో కేవలం 56 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని చెప్పారు. నకిలీ మందులు తయారీ, సరఫరాదారుల పట్ల కఠినంగా వ్యవహరించిన అధికారులను మంత్రి అభినందించారు. రాష్ర్టంలో డ్రగ్స్ రాకెట్ నిర్వహించే వారిని గుర్తించి చట్టపరమైన కేసులను వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు.

అనుమతులు లేని మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలపై చర్యలు చేపట్టాలని చెప్పారు. మందుల కొనుగోలులో ప్రజలు అవగాహనను పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ రాందాన్, డిప్యూటీ డైరెక్టర్లు రాజవర్ధనచారి, పీ సరళ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు గోవిందసింగ్ నాయక్, అనిల్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.