calender_icon.png 30 September, 2024 | 4:47 AM

పాతాళాన్ని పగులగొట్టి..

30-09-2024 12:00:00 AM

నస్రల్లా హత్యకు ఇజ్రాయెల్ పకడ్బంధీ ప్లాన్

భూమికి 60 అడుగుల లోతు బంకర్లో హెజ్బొల్లా అధినేత

రెండు సెకన్లకో బాంబు వేసిన చంపేసిన ఇజ్రాయెల్

లెబానాన్ రాజధానిపై కొనసాగుతున్న దాడులు

నిరాశ్రయులైన లక్ష మంది.. సిరియాకు పరార్

ఇరాన్‌లో ఎక్కడైనా దాడులు చేయగలం: నెతన్యాహు

టెల్ అవీవ్, సెప్టెంబర్ 29: లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హెజ్బొల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లాను శుక్రవారం చంపేసిన తర్వాత కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఆపటంలేదు. శనివారం మరో కీలక హెజ్బొల్లా నేతను చంపేసినట్లు ప్రకటించింది.

అయితే, చాలాఏండ్లుగా ఎంతో రహస్యంగా జీవిస్తున్న నస్రల్లాను ఇజ్రాయెల్ ఎలా చంపేసిందనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున జరుగుతున్నది. నిజానికి గూఢచర్యం విషయంలోనూ, అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండటంలోనూ ఇజ్రాయెల్ చాలాదేశాలకంటే ముందున్నది.

ఆ టెక్నాలజీకి గూఢచర్యాన్ని జోడించి ప్రపంచంలోనే శక్తిమంతమైన ఉగ్రవాద సంస్థను వారాల వ్యవధిలోనే కోలుకోలేని దెబ్బతీసిందని నిపుణుల చెప్తున్నారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లో కొంతప్రాంతాన్ని హెజ్బొల్లా తన ఆధీనంలోకి తీసుకొని స్వయం పాలన చేస్తున్నది.

ఆ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించటం దాదాపు అసాధ్యమని చెప్తారు. కానీ, ఆ ప్రాంతంలోనూ హెజ్బొల్లా ఆనుపానులను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కనిపెట్టాయి. హెజ్బొల్లా టాప్ కమాండర్లందరికి సంబంధించిన పక్కా సమాచారం సేకరించి ఒక్కొక్కరిని ఏరివేశాయి. నస్రల్లా హత్య ప్రపంచాన్నే నివ్వెరపరిచింది.

60 అడుగుల లోతులో బంకర్

హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను అంతం చేయాలని ఇజ్రాయెల్ దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. 2006లోనే ఆయనపై దాడి చేసినా తృటిలో తప్పించుకొన్నాడు. అప్పటి నుంచి బహిరంగంగా ఎవరికీ కనపించలేదు. తన బలగాలకు ఏదైనా సందేశం ఇవ్వాలనుకొంటే వీడియో సందేశాలు విడుదల చేయటమో, టీవీలో మాట్లాడటమో చేస్తుండేవారు. 

60 అడుగుల లోతులో బంకర్

ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుంచి తప్పించుకొనేందుకు హెజ్బొల్లా సంస్థ అత్యున్నత నిర్ణాయక మండలి జిహార్ కౌన్సిల్‌లోని సభ్యులంతా చాలా పకడ్బంధీ రక్షణ చర్యలు తీసుకొంటారు. జిహాద్ కౌన్సిల్‌లో ఉన్నవారంతా సంస్థలో టాప్ కమాండర్లని అర్థం. వీరి ఒక్కొక్కరు ఒక్కో విభాగానికి నాయకత్వం వహిస్తారు.

వీరి కదలికలు సామాన్యులకు అస్సలు తెలియవు. ఇక, బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయం కూడా శత్రు దుర్బేధ్యంగా ఉంటుంది. ఆ భవనం కింద 60 అడుగుల లోతులో శక్తిమంతమైన బంకర్ ఉంటుంది. నస్రల్లాతోపాటు హెజ్బొల్లా టాప్ కమాండర్లంతా అక్కడే సమావేశమవుతారు.

నస్రల్లా ఎక్కువ సమయం ఆ బంకర్లోనే ఉంటారు. అంతలోతులోని బంకర్‌ను కూడా ఇజ్రాయెల్ బాంబులతో ధ్వంసం చేసి నస్రల్లాను చంపేసింది. నస్రల్లా ఆనుపానులు కనిపెట్టేందుకు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు 20 ఏండ్లపాటు కష్టపడ్డాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. 

మరో కమాండర్ హతం

నస్రల్లాను చంపేసిన మరుసటి రోజే ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లాకు చెందిన మరో సీనియర్ కమాండర్‌ను కూడా మట్టుబెట్టింది. హెజ్బొల్లా గూఢచారి విభాగం అధిపతి హసన్ ఖలీల్ యాసిన్‌ను శనివారం బీరుట్‌లో వైమానిక దాడిలో చంపేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది.

మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ విమానాలు బాంబులను జారవిడుస్తూనే ఉన్నాయి. బీరుట్‌తోపాటు బెకా లోయలోని అనేక ప్రాంతాలపై శనివారం దాడులు చేసింది. ఈ దాడుల్లో 33 మంది మరణించినట్లు, 200 మంది గాయపడ్డట్లు లెబనాన్ తెలిపింది. 

ఇరాన్ గూఢచారి సమాచారంతో.. 

బీరుట్‌లో హెజ్బొల్లా స్థావరాల గురించిన సమాచారం ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ వద్ద ఉన్నది కానీ, అందులో నస్రల్లా ఎక్కడ ఉంటారన్నది మాత్రం కచ్చితంగా తెలుసుకోలేకపోయింది. గాజాపై దాడులు మొదలుపెట్టిన తర్వాత హెజ్బొల్లా కచ్చితంగా తనపై దాడి చేస్తుందని ముందే ఊహించిన ఇజ్రాయెల్.. ఆ సంస్థ టాప్ కమాండర్ల సమాచారాన్ని తెలుసుకోవటం మొదలుపెట్టింది.

కొన్ని నెలలుగా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి హెజ్బొల్లా కమాండర్ల జాడను కచ్చితంగా గుర్తించి చంపేయటం మొదలుపెట్టింది. ఆ క్రమంలో నస్రల్లా ఎక్కడ దాక్కున్నారన్న రహస్యాన్ని ఇజ్రాయెల్‌కు పరమ శత్రువైన ఇరాన్‌కు చెందిన ఓ గూఢచారే బయటపెట్టారని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది.

బీరుట్‌లోని ధహియే ప్రాంతంలో కిక్కిరిసి ఉన్న భవనాల మధ్య హెజ్బొలా ప్రధాన కార్యాలయ భవనం ఉందని, దాని కింద 60 అడుగుల లోతులో ఒక బంకర్ ఉందని, అందులోనే నస్రల్లా ఉంటాడని, త్వరలో తన కమాండర్లతో అక్కడ ఆయన సమావేశం కాబోతున్నాడని ఆ ఇరాన్ గూఢచారి ఇజ్రాయెల్‌కు పూర్తి సమాచారం చేరవేశాడు.

అతడిచ్చిన సమాచారాన్ని మరికొన్ని మార్గాల ద్వారా ధృవీకరించుకొన్న మొసాద్.. తమ ప్రధానికి దానిని చేరవేసింది. గత బుధవారం ఆయన ఆ భవనంపై భీకర దాడికి అనుమతి ఇచ్చినట్లు ఫ్రాన్స్‌కు చెందిన మీడియా రిపోర్ట్ చేసింది. 

ఇరాన్ అత్యవసర భేటీ

నస్రల్లా హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని తన మద్దతుదారులందరికీ ఇరాన్ మత పెద్ద ఖొమేనీ పిలుపునివ్వటంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. ‘మా జోలికి వస్తే భూమిపై ఇరాన్‌ను లేకుండా చేయగలం. ఇరాన్‌లోని ఏ మూలలో మా శత్రువులు దాక్కున్నా అక్కడి చేరుకొని చంపేయగలం’ అని హెచ్చరించారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అత్యున్నత భద్రతా మండలి ఆదివారం అత్యసరంగా సమావేశ మైంది. ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఎదుర్కొనే తీరుపై చర్చించినట్లు తెలిసింది. కాగా, లెబనాన్ సార్వభౌమ త్వాన్ని గౌరవించాలని ఇజ్రాయెల్‌కు చైనా సూచించింది.

నస్రల్లా మృతదేహం లభ్యం 

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో శుక్రవారం మరణించిన హసన్ నస్రల్లా మృతదేహాన్ని ఘటనా స్థలం నుంచి వెలికితీసినట్లు లెబనాన్ ప్రకటించింది. 80 టన్నుల బాంబులు పడినా ఆయన దేహానికి గాయాలేవీ కాలేదని వెల్లడించింది. బాంబుల ప్రభావానికి గురై చనిపోయినట్లు తెలిపింది. 

80 టన్నుల బాంబులు 

ఎలాగోలా కష్టపడి నస్రల్లా సమాచారం సేకరించిన ఇజ్రాయెల్‌కు 60 అడుగుల లోతులో ఉన్న బంకర్‌ను ధ్వంసం చేయటం సవాలుగా మారింది. ఎలాగైనా నస్రల్లాను అంతం చేయాలన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఆ పనిని హ్యామ ర్స్ అని పిలిచే 69వ స్కాడ్రన్‌కు అప్పగించింది. ఇజ్రాయెల్ వాయుసేనలోని ఈ దళానికి అత్యంత కఠినమైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్నది.

అయితే, గత ఏడాది నెతన్యాహూ తెచ్చిన న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఈ దళం విధులు బహిష్కరించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత విధుల్లోకి చేరింది. నస్రల్లా కోసం రంగంలోకి దిగిన హ్యామర్స్ అమెరికా నుంచి దిగుమతి చేసుకొన్న బీఎల్ యూ టీ బాంబులను ఎఫ్‌ధొ ర్యామ్ యుద్ధ విమానాలకు అమర్చి హెజ్బొల్లా కార్యాలయంపై ప్రయోగించింది.

ప్రతి రెండు సెకన్లకు ఒక బాంబు చొప్పున 80 బాంబులను ఆ భవనంపై వేసింది. దీంతో టన్ను బరువున్న ఒక్కో బాంబు పేలుతున్నాకొద్ది ఆ భవనం స్థానంలో భారీ బిలం ఏర్పడటం మొదలైంది. అలా నస్రల్లా దాక్కున్న బంకర్ వరకు బాంబులు వెళ్లి దాన్ని పేల్చివేశాయని ఇజ్రాయెల్ సైన్యం వివరించింది.  

నీడ కోల్పోయిన లక్షమంది 

బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుండటంతో నగరంలోని దాదాపు లక్ష మంది నిరాశ్రయులైనట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. వీరంతా ప్రాణాలు కాపాడుకొనేందుకు సిరియాలోకి పారిపోతున్నారు. వేలమంది ప్రజలు రోడ్లపై సిరియావైపు తరలిపోతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో గత రెండు వారాల్లో బీరుట్‌లోనే వెయ్యిమంది మరణించారు. 6 వేల మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది.